Thursday, May 9, 2024

వైసిపి జిల్లా అధ్య‌క్షుల బ‌స్సు యాత్ర‌…. వంద‌రోజులు కార్య‌చ‌ర‌ణ ప్ర‌ణాళిక‌..

అమరావతి, ఆంధ్రప్రభ : వైనాట్‌ 175 నినాదంతో వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారం కైవసం చేసుకునేందుకు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వేగంగా పావులు కదుపుతున్నారు. ఈక్రమంలోనే వైకాపా రాజకీయ సలహాదారు ప్రశాంత్‌ కిషోర్‌ టీం (ఐప్యాక్‌) వంద రోజుల కార్యాచరణ సిద్ధంచేసింది. ఈ వంద రోజులు పూర్తయ్యే నాటికి రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ వస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో భాగంగా పార్టీ పునర్‌ వ్యవస్థీకరణపై దృష్టికేంద్రీకరించారు. ఈక్రమంలోనే జిల్లా పార్టీ అధ్యక్షులు, నూతన కార్యవర్గాలను ఎంపికచేశారు. ఈనెలాఖరులోగా మండల కమిటీలను కూడా పూర్తిచేసేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ కమిటీలు పూర్తి కాగానే ప్రతి జిల్లాలోనూ ఆయా జిల్లా అధ్యక్షుడి నేతృత్వంలో జిల్లా కార్యవర్గ సభ్యులతో బస్‌ యాత్రను నిర్వహించనున్నారు. ఈబస్‌ యాత్రను కొత్తగా ఎంపిక చేసిన మండల కన్వీనర్లు, కార్యవర్గం వారివారి మండల పరిధిలో ఏఏ గ్రామాల మీదుగా సాగాలన్న దానిపై రోడ్‌ మ్యాప్‌ జిల్లా పార్టీకి ఇవ్వనుంది. అయితే, ఈసారి బస్‌ యాత్రలో భాగంగా జిల్లా పార్టీ వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆయా మండలాల పరిధిలో ఏఏ గ్రామాల పరిధిలో ఏఏ వర్గాలతో ఈ కమిటీ భేటీ అవ్వాలన్న దానిపై కూడా మండల కమిటీ జిల్లా కమిటీకి సూచనలు చేయనుంది. దీనికి సమాంతరంగా ఐప్యాక్‌ టీం కూడా ఆయా మండల భౌగోళిక, నైసర్గిక పరిసరాలు, వృత్తులు, వ్యాపారాలు, ప్రత్యేకత వంటి అంశాలతో రాష్ట్ర పార్టీకి ఒక నివేదిక అందజేస్తుంది. వీటన్నింటినీ క్రోడీకరించిన మీదట ఏఏ మండలంలో ఏఏ గ్రామంలో ఏఏ సమావేశాలు నిర్వహించాలన్న దానిపై ఒక స్పష్టత రానుంది. ఆమేరకు జిల్లా పార్టీ బస్‌ యాత్ర నెల రోజులపాటు జిల్లా మొత్తం పర్యటించి నిత్యం ప్రజల్లో పార్టీ కార్యక్రమాలు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వై ఏపీ నీడ్స్‌ జగన్‌ పేరుతో కొత్త కార్యక్రమం జరుగుతోంది. దీనికి సమాంతరంగా బస్‌ యాత్ర జరగనుంది. ఈ రెండు కార్యక్రమాలు పూర్తయ్యేలోగా మరో కార్యక్రమాన్ని తెరమీదకు తీసుకొచ్చేలా ఐప్యాక్‌ కార్యాచరణ రూపొందిస్తోంది.

వంద రోజుల కార్యాచరణ
ఆగస్టు నెలాఖరులోగా మండల కమిటీలు పూర్తికాగానే వై ఏపీ నీడ్స్‌ జగన్‌, పార్టీ జిల్లా అధ్యక్షుల బస్‌ యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఇవి పూర్తయ్యేలోగా మరో కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. ఇలా సెప్టెంబరు నుండి నవంబరు వరకూ వివిధ కార్యక్రమాలతో నిత్యం ప్రజల మధ్యే ఉండేలా కార్యాచరణ సిద్ధమౌతోంది. సీఎం జగన్‌కు రాజకీయ సలహాదారుగా ఉన్న ఐప్యాక్‌ టీం ఈమేరకు సరికొత్త కార్యక్రమాలను రూపొదించే పనిలో బిజీబిజీగా గడుపుతోంది. ఇదే సమయంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజల విజ్ఞప్తుల నేపథ్యంలో మరో మారు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధమౌతోంది. ఇక పార్టీ అనుబంధ విభాగాలను కూడా ఆయా వర్గాలతో సమావేశాలు ఏర్పాటుచేసేలా ప్రణాళికలు సిద్ధమౌతున్నాయి. కొత్తగా జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ జరిగిన తరువాత ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఏడు అసెంబ్లిd నియోజకవర్గాలు మాత్రమే ఉండే ఒక జిల్లాలో ఒకవైపు వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం, మరోవైపు బస్‌యాత్ర, మధ్యలో అనుబంధ విభాగాల సమావేశాలు, ఇంకోవైపు సురక్ష కార్యక్రమం జరుగుతూ నిత్యం ఆయా జిల్లాలో ఒక ఉత్సవం జరుగుతుందన్న రీతిలో కార్యక్రమాలు నిర్వహింబచబోతున్నారు.

ఈలోగానే ఎన్నికల కోడ్‌
రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతుండగానే మరోపక్క ఎన్నికల కోడ్‌ వచ్చే ఛాన్స్‌ ఉంది. అంటే ఎన్నికల కోడ్‌ వచ్చేంత వరకూ వివిధ కార్యక్రమాలతో నేతలు ప్రజల మధ్యే నిత్యం గడిపేలా సీఎం జగన్‌ కార్యక్రమాలనులా రూపొందిస్తున్నారు. ఇదిnnలావుండగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యేలు ఎన్నికల సమయం వచ్చే వరకూ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా పార్టీ సీనియర్‌ నేతల్లో వ్యవక్తమవుతోంది. చేస్తున్న మంచిని చెప్పే క్రమంలో పదే పదే ప్రజల మధ్య ఉంటే ప్రతిపక్షాల విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొట్టే అవకాశం ఉంటుందని అంటున్నారు. పార్టీలోని బూత్‌ లెవల్‌ నుండి రాష్ట్ర స్థాయి వరకూ వివిధ కార్యక్రమాల్లో నిత్యం బిజీబిజీగా ఉండేలా అనేక కార్యక్రమాలను రూపొందించాలని అధిష్టానం యోచిస్తోంది. ఆ మేరకు వేగంగా అడుగులు వేస్తుంది. ఆమేరకు పార్టీ కేడర్‌ను కూడా సంసిద్ధంచేసేందుకు ఇప్పటినుండే కార్యకర్తలతో సమావేశాలు కూడా నిర్వహించేలా చర్యలు తీసుకోబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement