Friday, May 17, 2024

Delhi | వైసీపీ, కాంగ్రెస్, షర్మిల అంతా ఒకటే.. లంక దినకర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వైఎస్సార్ కాంగ్రెస్, షర్మిల, కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటేనని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏపీ అధికార ప్రతినిధి లంక దినకర్ ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన వైఎస్ షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో చీత్కారానికి గురై ఇప్పుడు ఏపీకి వచ్చారని ఆరోపించారు. అధికారం, పదవుల కోసమే ఆమె పార్టీలు మారారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగించేందుకు అన్నాచెల్లెళ్లు నడుం కట్టారని అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు కాబట్టి తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా అంటూ ప్రజలను ఇంకా మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. గడచిన నాలుగున్నరేళ్లలో ఏపీలో జరుగుతున్న అవినీతి, రాజకీయాల గురించి మాట్లాడని షర్మలి, ఇప్పుడు మాట్లాడుతున్నారని అన్నారు. తండ్రి మరణానికి కాంగ్రెస్ కుట్ర చేసిందన్న షర్మిల ఇప్పుడు చంద్రముఖిలా మారారని విమర్శించారు.

ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికీ సాధ్యం కాదని చెబుతూ.. 2013లోనే రఘురామరాజన్ కమిటీ నాటి ఆర్థిక మంత్రి చిదంబరంకు నివేదిక ఇచ్చిందని లంక దినకర్ అన్నారు. అందుకే ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పొందుపర్చలేదని సూత్రీకరించారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన మంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడేది బీజేపీ మాత్రమేనని, త్వరలో ఏపీ అభివృద్ధి కోసం బ్లూ ప్రింట్ విడుదల చేస్తామని అన్నారు. అయోధ్యలో రామాలయం పూర్తిచేసినట్టే ఏపీ అభివృద్ధి కూడా బీజేపీతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement