Monday, April 29, 2024

ICC | ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీ.. షెడ్యూల్ రిలీజ్ చేసిన‌ ఐసీసీ

ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా భారత్ ఒంటరిగా వన్డే ప్రపంచకప్ కు ఆతిథ్యమివ్వనుంది. ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ 8 జట్లు వన్డే ప్రపంచకప్ కు అర్హత సాధించాయి. అయితే మరో రెండు జట్ల ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీ జింబాబ్వే వేదికగా జరగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ కాసేపటి క్రితమే ప్రకటించింది. మాజీ చాంపియన్స్ శ్రీలంక, విండీస్ జట్లకు ఈ టోర్నీ అత్యంత కీలకంగా మారింది.

- Advertisement -

ఇందులో మొత్తం 10 జట్లు పోటీ పడనున్నాయి. గ్రూప్ ‘ఎ’లో వెస్టిండీస్, జింబాబ్వే, నెదర్లాండ్స్, నేపాల్, యునైటెడ్ స్టేట్స్ జట్టు.. గ్రూప్ ‘బి’లో శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఓమన్, యూఏఈ జట్లు ఉన్నాయి. ఈ టోర్నీ జూన్ 18 నుంచి జూలై 9 వరకు జరగనుంది. ఇందులో ప్రతి జట్టు కూడా తమ గ్రూప్ లోని మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. రెండు గ్రూప్ ల్లోనూ టాప్ 3లో నిలిచిన 6 జట్లు సూపర్ సిక్స్ కు అర్హత సాధిస్తాయి.

సూపర్ 6లో ఒక్కో జట్టు నాలుగు జట్లతో ఆడనుంది. అనంతరం టాప్ 2లో నిలిచిన జట్లు ఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి. అంతేకాకుండా భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2023కి కూడా క్వాలిఫై అవుతాయి. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2023లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. టోర్నీ అక్టోబర్ 5న ఆరంభమయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే షెడ్యూల్ పై ఐసీసీ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement