Friday, May 3, 2024

దర్యాప్తు సంస్థలకు సహకరిస్తా: ఎమ్మెల్సీ కవిత

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ జారీ చేసిన నోటీసుల‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ కోసం ఈ నెల 9న ఢిల్లీకి రమ్మంటూ ఈడీ నుంచి నోటీసులు వచ్చాయని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తాను. కానీ ధర్నా, ముందస్తు అపాయింట్‌మెంట్ల‌ రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటాన‌ని ఎమ్మెల్సీ క‌విత ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. మహిళా రిజర్వేషన్ల కు సంబంధించిన బిల్లు చాలా కాలంగా పెండింగ్ లో ఉందని, దానిని వెంటనే పాస్ చేయాలనే డిమాండ్ తో ఢిల్లీలో ధర్నా తలపెట్టిన విషయాన్ని కవిత గుర్తుచేశారు. ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది అని క‌విత తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కాలేనని ఎమ్మెల్సీ చెప్పారు. లిక్కర్ స్కాంతో తనకెలాంటి సంబంధం లేదన్నారు. విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని, చట్టాన్ని తాను గౌరవిస్తాన‌న్నారు. అయితే ముందస్తు కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కోరతానన్నారు. ఈడీ నోటీసులకు తాను భయపడబోనని, బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తానని కవిత స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ తలవంచదన్నారు. దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతాము. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని ఢిల్లీలో ఉన్న అధికారకాంక్షపరులకు గుర్తుచేస్తున్నాను. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తాము అని క‌విత స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement