Monday, April 29, 2024

Well done – గగన్ యాన్ మిషన్ టెస్ట్ స‌క్సెస్ …. ఇస్రో టీమ్ కు ప్ర‌ధాని మోడీ కంగ్రాట్స్

న్యూఢిల్లీ – భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నిర్వహించిన గగన్ యాన్ మిషన్ టెస్ట్ ను విజయవంతంగా పరీక్షించడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు పెట్టారు. ఈ ప్రయోగం భారతదేశాన్ని తన మొదటి మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమానికి ఒక అడుగు దగ్గరగా తీసుకువెళుతుందని ఆయన పేర్కొన్నారు. ఇస్రోలోని శాస్త్రవేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఇదిలా ఉండగా.. శనివారం ఉదయం 8.45 గంటలకు ఇంజిన్ ఇగ్నీషన్ లోపం కారణంగా ప్రయోగాన్ని నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎస్ డీఎస్ సీ) నుంచి ఉదయం 10 గంటలకు ఈ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. ‘‘మిషన్ గగన్ యాన్ టీవీ డీ1 టెస్ట్ ఫ్లైట్ పూర్తయింది. క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనుకున్న విధంగా పనిచేసింది. మిషన్ గగన్ యాన్ విజయవంతమైంది’’ అని ఇస్రో ప్రకటించింది.


ప్రతిష్టాత్మక గగన్ యాన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ మొదటి టెస్ట్ ఫ్లైట్ ఇది. మూడు రోజుల మిషన్ కోసం ముగ్గురు వ్యక్తుల బృందాన్ని 400 కిలోమీటర్ల కక్ష్యలోకి పంపించి, మానవ అంతరిక్షయానంలో భారతదేశ సామర్థ్యాన్ని ప్రదర్శించడం, తిరిగి వారు హిందూ మహాసముద్రంలో సురక్షితంగా దిగడం ఈ టెస్ట్ ఫ్లైట్ లక్ష్యం. ప్రస్తుతం శిక్షణలో ఉన్న మొదటి వ్యోమగాములను వరుసగా 2025, 2040 నాటికి అంతరిక్షం, చంద్రుడిపైకి పంపే భారతదేశ ప్రణాళికలో ఈ మిషన్ భాగం.

Advertisement

తాజా వార్తలు

Advertisement