Monday, April 29, 2024

TS | ప్రతీకార చర్యలకు పాల్పడలేదు.. తెలంగాణను నెం1గా నిలబెట్టాం: కేటీఆర్

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో కొన్ని పొరపాట్లు చేశాం. ఆ తప్పులని సరిదిద్దుకుంటాం అని తెలిపారు. రాష్ట్ర రాజకీయాలు మరో దశాబ్దం పాటు కేసిఆర్ చుట్టూనే తిరుగుతాయని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వంలో తెలంగాణను నం.1గా నిలబెట్టాం అని అన్నారు. రైతుబంధు, దళితబంధు, కార్యకర్తల విషయంలో పొరపాట్లు గుర్తించలేకపోయాం అని అన్నారు. స్వల్ప తేడాతోనే ఓడిపోయాం. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా విజయం సాధిస్తాం అని కేటీఆర్ వెల్లడించారు.

ట్రయిల్ అంతా మీడియాలోనే నడుస్తోంది..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన ప్రమేయం లేదని… లై డిటెక్టర్, నార్కో టెస్ట్ కైనా సిద్ధమన్నారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తున్నారని దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ట్యాపింగ్ జరిగిందా.. లేదా.. అన్నది కోర్టులు తేల్చాలి. నేను ఏ తప్పు చేయలేదు.. చేస్తే ఎవరైనా శిక్షార్హుడే.. కానీ మీడియాలో ట్రయల్ జరుగుతున్నది ఇది తప్పు. యూట్యూబ్ ల్లో ప్రచారం వాంచనీయం కాదు. ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పుదోవ పట్టించడానికే ఈ ప్రచారంమంతా.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతున్నదని కేటీఆర్ పేర్కొన్నారు.

అసలు రేవంత్ రెడ్డి… రాహుల్ గాంధీ పార్టీలో ఉన్నారా? మోదీ పార్టీలో ఉన్నారా? అని ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ ఇక్కడ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని విమర్శించారు. ప్రధాని మోదీని బడేబాయ్ అని రేవంత్ రెడ్డి అంటే రాహుల్ గాంధీ చౌకీదార్ దొంగ అంటారని, కవిత అరెస్టును రేవంత్ సమర్థిస్తే, కేజ్రీవాల్ అరెస్టును రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నారని, రేవంత్ రెడ్డి గుజరాత్ మోడల్ అంటే, రాహుల్ గాంధీ ఫేక్ మోడల్ అంటారని కేటీఆర్ అన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అవుతారని కేటీఆర్ జోస్యం చెప్పారు. తాను మాట్లాడే ప్రతి అంశంపై మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి.. బీజేపీలోకి వెళతారు అంటే మాత్రం స్పందించడం లేదన్నారు.

- Advertisement -

ఉంటే వాళ్ల జేబులో ఉండాలి.. లేదా జైల్లో ఉండాలి.. ఇదే బీజేపీ సిద్ధాంతం

బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఎలాంటి సంబంధాలు లేవని బీజేపీ కీలక నేతలను ఓడించిందే తాము అన్నారు. తెలంగాణలో కొరుకుడుపడని కొయ్య కేసీఆర్ అని బీజేపీకి అర్థమైందన్నారు. అందుకే బీజేపీ తీరు ఉంటే బీజేపీతో ఉండు లేదంటే ఈడీ, సీబీఐ కేసులు అన్న విధంగా ఉందని మండిపడ్డారు. తాము మాత్రం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement