Thursday, April 25, 2024

అడుగంటుతున్న నీటి వనరులు.. కనిష్ట నీటి మట్టానికి చేరువైన శ్రీశైలం

అమరావతి, ఆంధ్రప్రభ : భానుడు నిప్పులు చెరుగుతున్నాడు.. ఎండలు మండిపోతున్నాయి.. నదీ జలాల ప్రవాహంలో వేగం తగ్గిపోయింది.. ఫలితంగా రిజర్వాయర్లు అడుగంటిపోతున్నాయి. కృష్ణా బేసిన్‌ లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయమైన శ్రీశైలంలో నీటిమట్టం 808 అడుగుల కనిష్ఠ స్థాయికి పడిపోగా 215.81 టీఎంసీల గరిష్ట సామర్ద్యానికి గాను కేవలం 33.42 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల వంటి భారీ జలాశయాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 480.77 టీఎంసీల సామర్దంతో కూడిన 108 మేజర్‌ రిజర్వాయర్లలో నీటి నిల్వలు 48.88 శాతానికి తగ్గిపోయాయి. 147.45 టీఎంసీల సామర్ద్యంతో కూడిన 38,416 మైనర్‌ ఇరిగేషన్‌ కు చెందిన చెరువుల్లో నీటి నిల్వలు 71.44 శాతానికి తగ్గాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల జలాశయాల్లో నీటి నిల్వలు కాస్త పెరిగాయి.. లేదంటే ఇప్పటికే రిజర్వాయర్లలో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరి ఉండేవి. కృష్ణాలోని అన్ని రిజర్వాయర్ల పరిధిలో గత ఏడాది ఇదే సమయానికి 297.33 టీఎంసీలు.. గరిష్ట నిల్వ సామర్దంలో 50.42 శాతం నీటి నిల్వలుంటే ఈ ఏడాది కేవలం 256.19 టీఎంసీలు.. గరిష్ట నిల్వ సామర్దంలో 43.45 శాతం నీటి నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

గోదావరిలో గత ఏడాది 68.79 శాతం నీటి నిల్వలుంటే ఈ సంవత్సరం 62.86 శాతం నిల్వలు మాత్రమే ఉన్నాయి. పెన్నాలో గత ఏడాది 143 టీఎంసీలు.. గరిష్ట సామర్దంలో 59.76 టీఎంసీలుంటే ఈ ఏడాది 142.59 టీఎంసీలు.. 59.51 శాతానికి నీటి నిల్వలు చేరాయి. నదీ జలాలతో సంబంధం లేకుండా కేవలం వర్షపాతం ఆధారంగా ఉన్న నీటి వనరుల్లో గత ఏడాది 88.24 టీఎంసీలు.. 59.49 శాతం నిల్వలుంటే ఈ ఏడాది 78.28 టీఎంసీలు.. 52.78 శాతానికి నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నీటి వనరుల నిల్వ సామర్దం 983.49 టీఎంసీలు కాగా.. గత ఏడాది ఇదే సమాయానికి 532.8 టీఎంసీలు.. 54.17 శాతం నీటి నిల్వలు అందుబాటులో ఉంటే ఈ సంవత్సరం 480.77 టీఎంసీలు.. 48.88 శాతం నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. దీనికి తగ్గట్టు రెండు తెలుగు రాష్ట్రాల్ర ఉమ్మడి ప్రాజెక్టయిన శ్రీశైలం నీటి మట్టం ఈనెల 28 మంగళవారం సాయంత్రం నాటికి 808.6 అడుగుల కనిష్ట స్థాయికి పడిపోయింది. 215.81 టీఎంసీల గరిష్ట సామర్ద్యానికి గాను జలాశయంలో కేవలం 33.42 టీఎంసీలు.. 15.49 శాతానికి నీటి నిల్వలు తగ్గపోయాయి. నాగార్జున సాగర్‌ లోనూ 312.05 టీ-ఎంసీల గరిష్ట నిల్వ సామర్ద్యానికి గాను 170.3 టీఎంసీలు.. 54.57 శాతం నిల్వలు మాత్రమే ఉన్నాయి.

ఆదుకుంటున్న భూగర్భ జలాలు..

- Advertisement -

రిజర్వాయర్లు అడుగంటు-తున్న అందుబాటులో ఉన్న భూగర్భ జలాలు ఉపశమనం కలిగిస్తున్నాయి. 2021, 2022లో విస్తారంగా కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు సమృద్ధిగా అందుబాటులోకి వచ్చాయి. అదే సమయంలో కృష్ణా, గోదావరిలో వరదలు పోటెత్తటంతో భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగించాల్సిన అవసరం రాలేదు. 2022లో దేశ వ్యాప్తంగా సగటు-న 60 శాతం భూగర్భ జలాలను వినియోగిస్తే ఏపీలో వినియోగం కేవలం 28 శాతంగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. ఫలితంగా రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో అవసరమైన మేరకు భూ గర్భజలాలను వినియోగించుకునే వెసులుబాటు కలిగింది. 2022లో రాష్ట్ర వ్యాప్తంగా 961.13 టీఎంసీల భూ గర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయి.

వాటిలో 913.11 టీఎంసీలను వినియోగించుకునే అవకాశం ఉన్నా గత ఏడాది కేవలం 263.05 టీఎంసీలను మాత్రమే ఉపయోగించారు. వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్న ఉమ్మడి అనంతపురం, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి మండలంలో మాత్రమే భూగర్భ జలాలను పరిమితికి మించి ఉపయోగించగా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో వినియోగం అత్యంత స్వల్పంగా నమోదయింది. ఈ నేపథ్యంలో నీటి ఎద్డడి ఎక్కువగా ఉన్న చోట భూగర్భ జలాల వినియోగం ఈ ఏడాది అధికంగా ఉండే అవకాశం ఉందని అంచనా.

Advertisement

తాజా వార్తలు

Advertisement