Sunday, March 24, 2024

Laughing Time | కాషాయ తీర్థం పుచ్చుకోగానే ‘ముఖచిత్రం’ మారిపోయింది.. అమిత్​షాని వెక్కిరిస్తూ పోస్టర్లు!

కేంద్ర హోం మంత్రి అమిత్​షాకు హైదరాబాద్​లో వింత పరిస్థితి ఎదురయ్యింది. ఆయన ఎయిర్​పోర్టు నుంచి సిటీకి వచ్చే దారి పొడువునా.. సిటీలోని మెయిన్​ సెంటర్లలో కొన్ని పోస్టర్లు ఆహ్వానిస్తూ వెలిశాయి.. అయితే.. ఇవి ఆయనను స్వాగతిస్తూ వేసిన పోస్టర్లు మాత్రం కాదు. షా షాక్​ తినేలా, అవినీతిపరులైన పలువురు నేతలు బీజేపీలో చేరగానే ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేసులు లేకుండా దర్జాగా పదవులు అనుభవిస్తున్న వారి ముఖ చిత్రాలతో ‘వాషింగ్​ పౌడర్​ నిర్మా’ యాడ్​ రూపంలో ఏర్పాటు చేసి, షాను ఎగతాలి చేసేలా ఉన్నాయి.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

CISF రైజింగ్ డే పరేడ్ కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్​ సిటీకి వచ్చారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో, మెయిన్​ రోడ్ల వెంబడి ‘వాషింగ్ పౌడర్ నిర్మా’.. ‘‘బైబై మోదీ’’ వంటి పోస్టర్లు అయనను వెక్కిరించేలా స్వాగతం పలికాయి. ఇక.. ప్రస్తుత బీజేపీ నేతలైన హిమంత బిస్వా శర్మ, నారాయణ్ రాణే, సువేందు అధికారి, సుజనా చౌదరి, విరూపాక్షప్ప, ఈశ్వరప్ప, జ్యోతిరాదిత్య సింధియా, అర్జున్ ఖోటార్‌ ముఖాలతో కూడిన బొమ్మలను పోస్టర్లలో ముద్రించారు. ఇవి తమను అవినీతి రహిత పార్టీగా మార్చినందుకు కాషాయ పార్టీని ఎగతాళి చేస్తూ దిగ్గజ నిర్మా ప్రొడక్ట్​ యాడ్​లో వచ్చే​ అమ్మాయి ముఖంతో తయారు చేశారు. అంతేకాకుండా పెద్ద పెద్దగా ‘వెల్‌కమ్ టు అమిత్ షా’ అని కూడా వాటిలో రాశారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి చెందిన ఆరోపణలపై BRS ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ రోజున హైదరాబాద్​ సిటీలో పెద్ద ఎత్తున పోస్టర్లు అంటించారు. నిన్న ‘రైడ్’ డిటర్జెంట్ పోస్టర్లు హల్​చల్​ చేయగా.. ఇవ్వాల (ఆదివారం) మాత్రం  నిర్మా పోస్టర్లు హైదరాబాద్​ సిటీ అంతటా కనిపించాయి.. అంతేకాకుండా హిందూ పురాణాల ప్రకారం కొన్ని వింత పోస్టర్లు కూడా కలకలం సృష్టించాయి. ప్రధాని నరేంద్ర మోదీని పది తలల రావణుడిగా చిత్రీకరిస్తూ హైదరాబాద్ అంతటా పోస్టర్లు వెలిశాయి.  పోస్టర్‌లో ప్రధాని మోదీని ‘ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి.. ‘వంచన తాత’ అని అభివర్ణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement