Friday, July 26, 2024

Delhi | గ్రోత్ ఇంజన్‌గా మారనున్న విశాఖ.. విమానయాన, పోర్టుల రంగాల్లో గణనీయ అభివృద్ధి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారత్ అభివృద్దిలో విశాఖపట్నం గ్రోత్ ఇంజన్‌గా మారనుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… డిసెంబర్ 10న రాజమండ్రికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారని, రాజమండ్రి విమానాశ్రయ టెర్మినల్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఏపీలో పౌరవిమానయాన, పోర్టుల రంగ అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తుందని అన్నారు.

విశాఖ భోగాపురం ఎయిర్‌పోర్టుకు కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చిందని… దేశంలో విమానయానం, పోర్టుల రంగాల్లో అభివృద్ధి గణనీయంగా పెరిగిందని చెప్పారు. 2047కి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2030 వరకు భారత్‌ను దేశంలోనే నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. దేశీయ విమానాల్లో 2014లో సంవత్సరానికి 6 కోట్ల మందే ప్రయాణించేవారని, ఇప్పుడు ఏకంగా 18 కోట్ల మందికి చేరిందని జీవీఎల్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో చాలా ఎయిర్ పోర్టులు నిర్మించామని, కొన్నింటికి అంతర్జాతీయ హోదా కల్పించామని వివరించారు.

2014 వరకు ఎయిర్‌పోర్టులు 74  ఉంటే ఇప్పుడా సంఖ్య 150కి పెరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం డ్రోన్ వ్యవస్థని పునరుద్ధరించిందని, ఆత్మనిర్భర్ కింద డ్రోన్స్ దేశంలోనే తయారవుతున్నాయని జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం పెద్దఎత్తున కేంద్ర ప్రభుత్వం రుణాలు ఇస్తోందన్న ఆయన, రక్షణ, వ్యవసాయ ఇతర రంగాలలో డ్రోన్ వాడకం పెరిగిందని చెప్పుకొచ్చారు. పోర్టు వ్యవస్థలో ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉన్నామని అన్నారు. ఓడరేవుల తయారీలో భారత్ 20 స్థానంలో ఉందని, దాన్ని ఐదవ స్థానానికి తీసుకొస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

కార్గో రవాణా కోసం వాటర్ వేస్, రోడ్ల విషయంలో గతంలో కంటే అనేకమార్గాలు ఏర్పాటు చేశామమని, నేషనల్ వాటర్ వేస్ కింద 54 వేల కిలోమీటర్ల మార్గాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. సాగర్‌మాల కింద 2016 నుంచి 2023 వరకు రూ. 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని జీవీఎల్ నరసింహారావు గణాంకాలు వెల్లడించారు. ‘పీఎం గతి శక్తి’ కింద రైల్వే వ్యవస్థను, రవాణా వ్యవస్థను, పోర్టు వ్యవస్థను పునరుద్ధరించారని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో చైనా, జపాన్, అమెరికా వంటి దేశాలను తట్టుకోవాలంటే వాటితో పోటీ పడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో గ్రోత్ సిటీస్‌గా విశాఖపట్నం, ముంబై, వారణాసి, సూరత్ పట్టణాలను గుర్తించామని జీవీఎల్ నరసింహారావు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement