Friday, May 3, 2024

ఢిల్లీలో విడదల రజిని.. ఏపీలో కొత్త వైద్య క‌ళాశాల‌ల నిర్మాణానికి సహకరించాలని వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా నిర్మిస్తున్న వైద్య క‌ళాశాల‌లకు కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారం కావాల‌ని రాష్ట్ర వైద్యారోగ్య‌ శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ మ‌న్సూక్ మాండ‌వీయ‌ను కోరారు. న్యూఢిల్లీలోని నిర్మాణ్ భ‌వ‌న్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ ప్ర‌ధాన‌ కార్యాల‌యంలో సోమవారం కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. దీంతో పాటు వైద్యారోగ్య శాఖకు సంబంధించి అనేక ఇతర విషయాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. గ‌తంలో 13 జిల్లాలుగా ఉన్న త‌మ రాష్ట్రం ఇప్పుడు 26 జిల్లాలుగా రూపాంత‌రం చెందింద‌ని కేంద్ర మంత్రికి తెలిపారు. త‌మ రాష్ట్రం అమ‌లు చేస్తున్న అనేక ప‌థ‌కాలు దేశ‌వ్యాప్తంగా ఆద‌ర్శంగా నిలుస్తున్నాయ‌న్నారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య‌శాఖ‌లో త‌మ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఎన్నో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకొచ్చార‌ని చెప్పారు. వాటికి కేంద్రం చొర‌వ కూడా తోడైతే తాము మ‌రింత‌గా అద్భుతాలు చేసి చూపిస్తామ‌ని తెలిపారు. పాడేరు, మ‌చిలీప‌ట్నం, పిడుగురాళ్ల లో మెడిక‌ల్ క‌ళాశాల‌ల నిర్మాణానికి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తులు వ‌చ్చాయ‌ని, ఇప్పుడు ఈ మూడు చోట్ల క‌ళాశాల‌ల నిర్మాణ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయ‌ని వివ‌రించారు.

ప్ర‌తి జిల్లాలోనూ క‌నీసం ఒక ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల ఉండేలా ముఖ్య‌మంత్రి చ‌ర్య‌లు తీసుకున్నార‌ని చెప్పారు. ఇప్ప‌టికే అన్ని చోట్లా మెడిక‌ల్ క‌ళాశాల‌ల నిర్మాణం ప్రారంభ‌మైంద‌న్నారు. రాష్ట్రంలో కొత్త‌గా నిర్మిస్తున్న 17 మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారం కావాల‌ని కోరారు. త‌గిన ఆర్థిక సాయం అంద‌జేయాల్సిందిగా విజ్ఞ‌ప్తి చేశారు. వైద్యారోగ్య రంగంలో ఏపీలో కీల‌క‌మైన మార్పులు తీసుకొస్తున్నామ‌ని చెప్పారు. ఫ్యామిలీ డాక్ట‌ర్ వైద్య విధానాన్ని రాష్ట్రంలో అమ‌లు చేస్తున్నామ‌న్నారు. వైఎస్సార్‌ హెల్త్ క్లినిక్‌ల గురించి కేంద్ర‌మంత్రికి వివ‌రించారు. ఎప్పుడూ, ఎక్క‌డా క‌నీవిని ఎరుగ‌ని రీతిలో ఏకంగా 46 వేల నియామ‌కాల‌ను ఒక్క వైద్యారోగ్య రంగంలోనే చేపట్టినట్టు తెలిపారు. ఏకంగా రూ. 16 వేల కోట్లకు పైగా నిధుల‌తో రాష్ట్రంలోని ఆస్ప‌త్రుల స్వ‌రూపాన్ని పూర్తిగా మార్చేస్తున్నార‌ని పేర్కొన్నారు. గ్రామ‌గ్రామానికి హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటుచేశామ‌ని తెలిపారు. కేంద్రం స‌హ‌కారం కూడా తోడైతే సీఎం జగన్ మ‌రిన్ని అద్భుతాలు చేసి చూపిస్తార‌ని చెప్పారు.

రాష్ట్ర మంత్రి విడ‌ద‌ల ర‌జిని విజ్ఞ‌ప్తుల‌కు కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి మన్సూక్ మాండ‌వీయ సానుకూలంగా స్పందించారని ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం వైఎస్ జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు త‌మ వంతు స‌హ‌కారం కూడా అంద‌జేస్తామ‌న్నారు. ఏపీలో వైద్య క‌ళాశాల‌ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామ‌ని హామీ ఇచ్చినట్టు మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో వైద్యారోగ్య‌శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement