Thursday, May 2, 2024

విమానాలు సరే.. కార్లు ఏవి?

కర్నూలు విమానాశ్రయంలో విమాన రాకపోకలు ప్రారంభం కావడంతో ప్ర‌యాణికుల సంద‌డి పెరిగింది. ప్రస్తుతం చెన్నై, బెంగ‌ళూరు, పుణే, విశాఖ‌ న‌గ‌రాల‌కు విమాన సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే.. విమానాలొస్తున్నాయి కానీ ప్రయాణికుల‌కు ఎయిర్ పోర్ట్ నుండి త‌మ గ‌మ్యం చేరుకునేందుకు ట్యాక్సీలు స‌రిపోవ‌టం లేద‌ని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఇదే అదునుగా ప్రైవేటు ఆప‌రేట‌ర్లు కేవ‌లం మూడు కి.మీ దూరానికి వంద‌ల రూపాయ‌లు డిమాండ్ చేస్తున్నారు.

అదే కర్నూలు వరకైతే 500 నుంచి 700 రూపాయ‌ల వ‌ర‌కు వసూలు చేస్తున్నారు. రోజుకు 200 నుంచి 250 మంది ఇక్కడి నుంచి విమాన ప్ర‌యాణం చేస్తున్నారు. గగన ప్రయాణం సజావుగా సాగినా ఇక్కడ దిగిన తర్వాత మాత్రం ట్యాక్సీలు లేక చుక్కలు చూడాల్సి వస్తోందని ప్ర‌యాణికులు మొర‌పెట్టుకుంటున్నారు. ఆన్ లైన్ క్యాబ్ బుకింగ్ ఫెసిలిటీ ఉంటే బాగుండేద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. క‌నీసం విమాన స‌మ‌యంలో ఆర్టీసీ ఏసీ, నాన్-ఏసీ స‌ర్వీసులు న‌డిపినా బాగుండేద‌ని, తమను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌టం లేద‌ని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement