Thursday, October 10, 2024

TS – కృష్ణా జ‌లాల్లో హక్కుల కోసం మరో పోరాటానికి సిద్దం – కెసిఆర్

న‌ల్ల‌గొండ : చ‌లో న‌ల్ల‌గొండ స‌భ రాజ‌కీయ స‌భ కానేకాదు.. ఉద్య‌మ స‌భ‌, పోరాట స‌భ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చిచెప్పారు. కృష్ణా జ‌లాల్లో తెలంగాణ వాటా కోసం ఏర్పాటు చేసిన స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగిస్తూ , “ఒక్క పిలుపుతో పులులాగా క‌దిలివ‌చ్చిన అన్నాచెల్లెల్లు, అక్కాత‌మ్ముళ్ల‌కు ఉద్య‌మాభివ‌నంద‌నాలు. ఇవాళ న‌ల్ల‌గొండ‌లో చ‌లో న‌ల్ల‌గొండ ప్రోగ్రాం తీసుకున్నాం. కార‌ణం ఏందంటే.. ఎందుకు మ‌నం ఈ స‌భ పెట్టాల్సి వ‌చ్చింది. నాకు కాలు విరిగిపోయినా కుంటి న‌డ‌క‌తోనే, క‌ట్టె ప‌ట్టుకోని ఇంత ఆయాసంతో ఎందుకు రావాల్సి వ‌చ్చింది. ఈ విష‌యం ద‌య‌చేసి అంద‌రూ ఆలోచించాలి” అని కేసీఆర్ కోరారు.

ఇది ఉద్యమ సభ ..మళ్లీ చావో రేవోకి సన్నద్ధం కావాలి …

” కొంద‌రికి ఇది రాజ‌కీయం. మ‌నం పెట్టింది ఉద్య‌మ స‌భ‌, పోరాట స‌భ‌, రాజ‌కీయ స‌భ కానే కాదు. కృష్ణా న‌దిలో మ‌న జ‌లాలు, నీళ్ల మీద మ‌న హ‌క్కు అనేది మ‌నంద‌రి బ‌తుకుల‌కు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌. చావో రేవో తేల్చే స‌మ‌స్య‌. ఈ మాట 24 ఏండ్ల నుంచి ప‌క్షిలాగా తిరుగుకుంటూ మొత్తం రాష్ట్రానికి చెబుతున్నా. ఇటు కృష్ణా కావొచ్చు. అటు గోదావ‌రి కావొచ్చు. నీళ్లు లేక‌పోతే మ‌న‌కు బ‌తుకు లేదు. ఆ ఉన్న నీళ్లు కూడా స‌రిగా లేక‌పోతే బతుకులు వంగిపోయాయి ఈ న‌ల్ల‌గొండ‌లో. ల‌క్షా 50 వేల మంది మునుగోడు, దేవ‌ర‌కొండతో పాటు ఇత‌ర ప్రాంతాల బిడ్డ‌ల‌ న‌డుము వంగిపోయాయి. చివ‌ర‌కు ఈ జిల్లాలో ఉద్య‌మ‌కారులంద‌రూ క‌లిసి ఫ్లోరైడ్ బారిన‌ప‌డ్డ‌ బిడ్డ‌ల‌ను తీసుకుపోయి ప్ర‌ధాన‌మంత్రి టేబుల్ మీద పండ‌వెడితే అయ్యా మా బ‌తుకు ఇది అంటే కూడా ప‌ట్టించుకోలేదు. ఆనాడు పార్టీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు లేరా. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత ఫ్లోరైడ్ ర‌హితంగా త‌యారు చేశాం. ఇదే విష‌యాన్ని ప్ర‌జ‌లు కూడా చెబుతున్నారు. భ‌గీర‌థ నీళ్లు వ‌చ్చాక ఆ బాధ‌లు పోయాయ‌ని ప్ర‌జ‌లు చెబుతున్నార‌ని ” కేసీఆర్ తెలిపారు.

నీళ్ల‌ను దొబ్బి పోదామ‌నుకునే స్వార్థ శ‌క్తుల‌కు హెచ్చ‌రిక

కృష్ణా న‌దిలో మ‌న వాటాకు వ‌చ్చే నీళ్ల‌ను దొబ్బి పోదామ‌నుకునే స్వార్థ శ‌క్తుల‌కు హెచ్చ‌రిక ఈ చ‌లో న‌ల్ల‌గొండ స‌భ అని గులాబీ బాస్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో 24 గంటల కరెంట్ సరఫరా అందజేశామని, దద్దమ్మల పాలనలో ఇలాగే ఉంటుందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు.
” ప్రజలు తమకు ప్రతిపక్ష హోదాను కట్టబెట్టారని, బిడ్డా.. ఛలో నల్లగొండ సభతో మా పోరు ఆపేది లేదని అన్నారు. దద్దమ్మలకు పాలన చేతకాక 24 గంటల కరెంటును ఇవ్వడం చేతకావట్లేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన పుణ్యాన తాము అధికారంలో ఉన్న నాటి కంటే రాష్ట్రంలో నేడు 5,600 మెగావాట్ల ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అవుతోందని’ పేర్కొన్నారు.
ఒక్క మీటింగ్‌లో మాట్లడుతుంటే ఏడు మాట్లు కరెంట్ కట్ అవుతోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సీఎం పదవి నుంచి తప్పుకోగానే ఏం మాయ రోగం వచ్చిందని.. ఎందుకు కరెంట్ కట్ అవుతోందంటూ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండు నెలలు గడుస్తున్నా.. రైతులకు ఇంకా రైతుబంధు ఇవ్వలేకపోయారంటూ నిలదీశారు. నీళ్లు, కరెంట్ విషయంలో తాము ప్రజలతో కలిసి ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. ఆ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గేది లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరెంట్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. లేదంటే వదలం, వెంటాడుతామని మాజీ సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు.

- Advertisement -

రైతులు చెప్పులు ఎలా ఉంటాయో తెలుసా….

” రైతుల‌ను చెప్పుతో కొడుతావా..? తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిర‌గ‌నివ్వ‌రా..? ఎన్ని గుండెల్రా మీకు అని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. ఈ రాష్ట్రానికి మేం చేసిన కాడికి చేశాం. ఫ‌లితం చూశాం. ఒక‌నాడు ఏడ్సిన తెలంగాణ‌.. నేడు మూడు కోట్ల ట‌న్నుల వ‌డ్లు పండించింది. రైతుబంధు ఇవ్వ‌డానికి కూడా చేత‌నైత‌ లేదు. ఇంత ద‌ద్ద‌మ్మ‌లా..? రైతుబందు కూడా ఇవ్వ‌రా..? అన్న‌దాత‌ల‌ను ప‌ట్టుకుని రైతుబంధు అడిగినోన్ని చెప్పుతో కొట్ట‌మంటావా..? ఎన్ని గుండెల్రా మీకు..? ఎట్ల మాట్లాడుతారు.. కండ‌కావ‌ర‌మా..? కండ్లు నెత్తికి వ‌చ్చినాయా..? ప్ర‌జ‌ల‌ను అలా అనొచ్చా..? ఒక్క మాట చెబుతున్నా జాగ్ర‌త్త‌.. నోటి ద‌రుసుతో మాట్లాడేటోళ్ల‌రా… చెప్పులు పంట‌లు పండించే రైతుల‌కు కూడా ఉంటాయి. రైతుల చెప్పులు ఎట్ల ఉంట‌యి.. బందోబ‌స్తుగా ఉంటాయి.. గ‌ట్టిగా ఉంట‌యి.. ఒక్క‌టే చెప్పు దెబ్బ‌తో మూడు ప‌ళ్లు ఊసిపోతాయి. దానికోస‌మేనా మీరు అడిగేది. ఇది మ‌ర్యాద‌నా.. గౌర‌వ‌మా..? ప్ర‌జ‌ల‌ను గౌర‌వించే ప‌ద్ధ‌తా..? చేత‌కాక‌పోతే జ‌ర త‌ర్వాత ఇస్తా.. లేదంటే మాకు చేయొస్తే లేదు అని చెప్పాలి. కానీ అడిగినోని చెప్పుతో కొట్టాలి అని అంటారా..? అని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

కేసీఆర్‌నే తిర‌గ‌నివ్వ‌రా..? ఏం చేస్త‌రు చంపేస్తారా..?

కేసీఆర్ చ‌లో న‌ల్ల‌గొండ అంటే కేసీఆర్‌ను తిరగ‌నివ్వం అని అంట‌రు. ఇంత మొగోళ్లా..? కేసీఆర్‌ను తిరగ‌నివ్వ‌రంట‌.. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిర‌గ‌నివ్వ‌రా..? ఏం చేస్త‌రు చంపేస్త‌రా..? దా.? చంపుతావా ఏపాటి చంపుతావో దా..? కేసీఆర్‌ను చంపి మీరు ఉంటారా.. ఇది ప‌ద్ద‌తా.. ప్ర‌తిప‌క్ష పార్టీ త‌ప్ప‌కుండా ప్ర‌జ‌ల త‌ర‌పున వ‌స్త‌ది. ప్ర‌జ‌ల మ‌ధ్య అడుగుత‌ది. మీకు ద‌మ్ముంటే మేం చేసిన దానికంటే మంచిగా చేసి చూపియ్. క‌రెంట్ మంచిగా ఇచ్చి చూపియ్.. ఆగ‌మాగం కావొద్దు. పాల‌మూరు ఎత్తిపోత‌ల పూర్తి చేయాలి. దాని గురించి మాట‌లేదు. ఖ‌మ్మంలో సీతారామ పూర్తి చేయాలి. దాని గురించి ముచ్చ‌ట లేదు. గురుకులాలు ఎక్కువ పెట్టాలి.. ఆ ముచ్చ‌ట‌ లేదు. క‌రెంట్ మంచిగా ఇవ్వాలి.. ఆ ముచ్చ‌ట లేదు. ఇవన్నీ మాయం చేసి బ‌లాదూర్‌గా తిరుగుదాం అనుకుంటున్నారా..? తిర‌గ‌నివ్వం జాగ్ర‌త్త అని చెబుతున్నాం. త‌ప్ప‌క నిల‌దీస్తాం. ఎండ‌గ‌డుతాం” అని కేసీఆర్ హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement