Friday, May 10, 2024

TS | కమలంలో కల్లోలం కంటిన్యూ.. నేతల షాకింగ్‌ ప్రవర్తన, అయోమయంలో శ్రేణులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ బీజేపీలో పరిణామాలు రోజుకోమలుపు తిరుగుతున్నాయి. నేడు ఉన్న పరిస్థితి పార్టీలో రేపు ఉండదని పార్టీ నేతలు, కార్యకర్తలు ఫిక్స్‌ అయిపోయారు. బీజేపీలో రాజకీయాలు పూటకోమలుపు తిరుగుతూ రాత్రికో స్టేట్‌మెంట్‌ అన్నచందంగా మారిపోవడంతో అసలు పార్టీలో ఏమి జరుగుతోందో అర్థం కాని పరిస్థితుల్లో కార్యకర్తలు కూరుకుపోయారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై నెలకొన్న గందరగోళం ఒక కొలిక్కి వచ్చిందనుకుంటున్న తరుణంలోనే మంగళవారం పార్టీ సీనియర్‌ నేత, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి షాక్‌ ఇచ్చారు.

కార్యకర్తలు మరోసారి అయోమయ పరిస్థితుల్లో కూరుకుపోయారు. నిన్నమొన్నటి వరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతోపాటు అసంతృప్త నేతలకు కీలక పదవుల విషయంలో రెండుగా పార్టీ చీలిపోయిన విషయం తెలిసిందే. రెండు నెలలుగా ఆ పరిణామాలు బీజేపీ కార్యకర్తలను అయోమయంలోకి నెట్టేశాయి. తీరా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను మారుస్తూ ఆ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టి, మరోవైపు ఈటల రాజేందర్‌కు కీలకమైన ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ పదవి ఇచ్చి వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకువచ్చామనుకుంటున్న తరుణంలో పార్టీ సీనియర్‌ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి షాక్‌ ఇచ్చారు.

- Advertisement -

కమలం పార్టీలో రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ బహి ష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో మంగళవారం భేటీ కావడం కాషాయపార్టీలో కలవరాన్ని సృష్టించింది. కాంగ్రెస్‌లో చేరికపై పొంగులేటితో రాజగోపాల్‌రెడ్డి సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఖమ్మం జనగర్జన సభలోనూ పార్టీని వీడిన నేతలకు కాంగ్రెస్‌ ధర్వాజలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పొంగులేటితో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారని ఆయన అన్న , ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీలో ఉన్న రాజగోపాల్‌రెడ్డి తిరిగి సొంతగూటికి చేరుతారని కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో రాజగోపాల్‌రెడ్డి మంగళవారం పొంగులేటితో రాజగోపాల్‌రెడ్డి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్‌ పార్టీలో చేరికపైనే ఇరువురు నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏడాదిన్నర క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరాక తన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా ఉప ఎన్నికల బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు.

ఇటీవల కొద్దిరోజులుగా బీజేపీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల ఢిల్లి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ప్రధానంగా లిక్కర్‌ స్కాంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్‌ కూతురు కవిత విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోవడాన్ని రాజగోపాల్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాను సీఎం కేసీఆర్‌ను గద్దెదించేందుకే బీజేపీలో చేరానని, కాని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విధానాలూ కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్నాయని ఆయన తన అనుచరుల వద్దబాహాటంగానే అసంతృప్తిని వెళ్లగక్కినట్లు తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో రాజగోపాల్‌రెడ్డి భేటీ కావడం ఆయన బీజేపీని వీడుతారన్న ప్రచారానికి బలం చేకూర్చినట్లయింది. కొద్ది రోజుల్లోనే ఆయన పార్టీ మార్పుపై క్లారిటీ రానుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement