Sunday, April 28, 2024

TS – తొలి రోజు ప్ర‌శాంతంగా ఇంట‌ర్ ప‌రీక్ష … ముగ్గురు విద్యార్ధుల డిబార్

హైద‌రాబాద్ : ఇంట‌ర్ వార్షిక ప‌రీక్ష‌లు బుధ‌వారం ప్రారంభ‌మ‌య్యాయి. తొలి రోజు ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌లు(సెకండ్ లాంగ్వేజ్ పేప‌ర్-1) ప్ర‌శాంతంగా ముగిసిన‌ట్లు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు అధికారులు వెల్ల‌డించారు. బుధ‌వారం జ‌రిగిన ప‌రీక్ష‌కు 5,07,754 మంది విద్యార్థులు హాజ‌రు కావాల్సి ఉండ‌గా, 4,88,113 మంది హాజ‌ర‌య్యారు. 19,641 మంది విద్యార్థులు హాజ‌రు కాలేదు. క‌రీంన‌గ‌ర్, నిజామాబాద్, జ‌న‌గామ జిల్లాల్లో మాల్ ప్రాక్టీస్ కేసులు ఒక్కొక్క‌టి చొప్పున న‌మోదు అయ్యాయి. ఇక ఇంట‌ర్ బోర్డు నుంచి న‌ల్ల‌గొండ‌, మెద‌క్, జ‌న‌గామ‌, నాగ‌ర్‌క‌ర్నూల్, రంగారెడ్డి జిల్లాల‌కు అధికారులు వెళ్లి ప‌రీక్ష‌లు జ‌రుగుతున్న తీరును ప‌రిశీలించారు.

నిమిషం నిబంధనలో ఆగమాగం..
విద్యార్థులు ఉదయం 8.45 గంటలకు సంబంధిత ఎగ్జామ్‌ సెంటర్‌లో ఉండాలి. ఉదయం 9 గంటల తర్వాత ఒక నిమిషం దాటినా ఎవరికి అనుమతి ఉండదు. ఇక ఈ ఏడాది 9,80,978 మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 4,78,718 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం వారుండగా, 5,02,260 మంది విద్యార్థులు ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ వాళ్లు ఉన్నారు. సెకండియర్‌ పరీక్షలకు హాజరయ్యే వారిలో 58,071 మంది ప్రైవేట్‌ విద్యార్థులున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు 1,521 సెంటర్లను ఏర్పాటు చేశారు.

ప్రత్యేక చర్యలు తీసుకున్న ఆర్టీసీ..
విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రాలలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక.. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకుని రావొద్దని అధికారులు తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ లలో నీటి, వైద్య సదుపాయం కల్పించారు.

మొబైల్స్​, ఎలక్ట్రానిక్​ గ్యాడ్జెట్స్​ నిరాకరణ..
పరీక్ష ప్రారంభమయ్యే 9 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించలేదు. చాలా ప్రాంతాల్లో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. దీని కోసం గంట ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు.

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్​
ప్రతీ పరీక్ష కేంద్రం పరిసరాల్లో 144వ సెక్షన్‌ అమలులో ఉంది. అంతేకాకుండా పరీక్ష కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లను పోలీసు శాఖ మూసివేసింది. ప్రశ్నపత్రాలను సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ఓపెన్​ చేశారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయం హెల్ప్ లైన్ కంట్రోల్ రూమ్ నెంబర్ 9603615652, 76710333232 సంప్రదించాలని తెలిపారు. ఇంటర్ పరీక్షల్లో ఒత్తిడిని ఎదుర్కోవడానికి టెలి మానస్ కార్యక్రమం లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్ 14416, 180091441655 కి కాల్ చేసి మానసిక నిపుణుల ద్వారా కౌన్సిలింగ్ పొందవచ్చని పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement