Saturday, May 4, 2024

TS | ఉపరాష్ట్రపతి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈ నెల 26న ఉపరాష్ట్రపతి జగదీప్‌ థన్కర్‌ రాష్ట్రానికి వస్తున్నందున అన్ని ఏర్పాట్లు పకడ్బంధీగా చేయాలని వివిధ శాఖల అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ఉపరాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లను సమీక్షించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి బ్లూ బుక్‌ ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్‌, బందోబస్త్‌ చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఉపరాష్ట్రపతి పర్యటనలో సరిపడా వైద్య సిబ్బందితో వైద్య సౌకర్యాలు కల్పించాలని ఆరోగ్య శాఖను ఆదేశించారు.

భారత ఉపరాష్ట్రపతి ప్రయాణించే దారిలో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ శాఖకు నిర్దేశించారు. అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని విధ్యుత్‌ శాఖను ఆదేశించారు. అదే విధంగా అగ్నిమాపక శాఖ తగిన అగ్నిమాపక ఏర్పాట్లు చేయాలన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర డీజీపీ రవిగుప్తా, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, గవర్నర్‌ కార్యదర్శి బీ వెంకటేశం, ఫైర్‌ సర్వీసెస్‌ డీజీ నాగిరెడ్డి, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఎండీ ముషారఫ్‌ అలీ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement