Wednesday, May 22, 2024

AP | డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణం.. డీఎస్సీపై తొలి సంతకం : చంద్రబాబు

శ్రీకాకుళం, ప్రభన్యూస్‌ బ్యూరో : రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే డ్వాక్రా మహిళా సంఘాలకు రూ.10 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు అందిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న ప్రజాగళం సభలు మంగళవారం పాతపట్నం, ఆమదాలవలస మండలాలలో నిర్వహించారు.

పాతపట్నంలో నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం వస్తే అందించనున్న పది ప్రధాన పధకాలను తెలియచేస్తూ, వీటిని అమలుచేసే భరోసా తాను తీసుకుంటానన్నారు. రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా రైతాంగాన్ని దగా చేస్తూ వస్తోందని మండిపడ్డారు. ఒక్క నీటిపారుదల ప్రాజక్టును కూడా పూర్తిచేయలేదని విమర్శించారు.

తన హయాంలో 72 శాతం పూర్తిచేసిన పోలవరం ప్రాజక్టును పూర్తిచేయలేదని, శ్రీకాకుళం జిల్లాలో వంశధార రెండవదశ నిర్మాణం తమ హయాంలో 85 శాతం పూర్తిచేస్తే దానిని కూడా పూర్తిచేయలేదని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రాజక్టులన్నీ పూర్తి చేస్తామని, , వంశధార రెండవ దశను రైతాంగానికి అంకితం చేస్తామన్నారు. కేంద్ర సహకారంతో పోలవరం ప్రాజక్టును కూడా పూర్తిచేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

రైతులకు సంవత్సరానికి 20 వేల రూపాయిల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని, అదే విధంగా రైతులకు సంపూర్ణ మద్దతు ధర అందించడమే కాకుండా, రైతాంగానికి ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణ విధానాన్ని అమలులోకి తెస్తామన్నారు. మహిళా సంఘాలను కూడా జగన్మోహనరెడ్డి ప్రభుత్వం దగా చేసిందని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే డ్వాక్రా సంఘాలకు 10 లక్షల రూపాయిల వరకూ వడ్డీలేని రుణం అందిస్తామని చంద్రబాబు తెలిపారు.

తమ సూపర్‌ సిక్స్‌ పధకాలలో భాగంగా ఒక ఇంటిలో ఉన్న పిల్లలకు నెలకు 1500 రూపాయిల చొప్పున తల్లికి వందనం కార్యక్రమం క్రింద అందించడం జరుగుతుందని తెలిపారు. ఆర్‌టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాతనే ఎన్‌టిఆర్‌ మహిళలకు ఆస్తిలో సగభాగం హక్కు కల్పించారని, అయితే వైఎస్‌ జగన్మోహనరెడ్డి తన తండ్రి ఆస్తులలో సొంత చెల్లికి భాగం ఇవ్వకుండా దగా చేసిన వ్యక్తని, ఇటువంటి వ్యక్తి ప్రజలకు, రాష్ట్రంలోని మహిళలకు ఏమి న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

రాష్ట్రంలో మద్య నిషేధం చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వమే మద్యం విక్రయాలు పెద్దఎత్తున నిర్వహిస్తూ మహిళలను దగాచేసిందని విమర్శించారు. ఆ మద్యం కూడా నాసిరకం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని, మహిళలను ఏడిపిస్తోందని ఆయన అన్నారు. యువతకు ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వకుండా జగన్మోహనరెడ్డి నిరుద్యోగ యువతను దగా చేశారని విమర్శించారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్‌ క్యాలండర్‌ ప్రకటించి, ప్రతి సంవత్సరం వేలాది ఉద్యోగాలు ఇస్తామని గత ఎన్నికల్లో ప్రకటించిన జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం రూ. 5 వేల రూపాయిల జీతంతో వాలంటీర్‌ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డీఎస్‌సీ నిర్వహణకు సంబంధించి ఫైల్‌పైనే తొలి సంతకం చేస్తానని ప్రకటించారు.

అదేవిధంగా ఐదు సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు యువతకు అందిస్తామని తెలిపారు. ఉద్యోగం వచ్చినంతవరకూ నెలకు 3వేల రూపాయిలు నిరుద్యోగభృతి అందిస్తామని ప్రకటించారు. వాలంటీర్లకు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.10 వేల జీతం ఇవ్వడం తోపాటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇచ్చి, వారి ఆదాయాన్ని మరింతగా పెంచుకునే విధంగా తాము ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

మే1న ఫించన్లు అందించాలి

రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే పింఛన్ల విషయంలో కూడా శవ రాజకీయాలు చేస్తోందని, మే 1వ తేదీన కఛ్చితంగా పింఛన్లు ఇంటింటికీ వెళ్లి అందించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి నెలా 1వ తేదీన వారి ఇంటికే పింఛన్‌ అంద జేస్తామన్నారు.

గతంలో పేదలకు రేషన్‌ దుకాణాల ద్వారా 8 రకాల వస్తువులను ప్రజలకు అందించడం జరిగిందని, అయితే జగన్మోహనరెడ్డి ప్రభుత్వం దానిని రద్దు చేసిందని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లి ఆ సరకులన్నీ రేషన్‌ కార్డు దారులకు అందిస్తామని తెలిపారు. అంతే కాకుండాపేదల కడుపునింపే అన్నా క్యాంటీన్లను తిరిగి తెరిపించడం జరుగుతుందని తెలిపారు. ఢిల్లికి కింజరాపు రామ్మోహననాయుడును, అమరావతికి గోవిందరావును ఎన్నుకోవాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement