Friday, May 17, 2024

Delhi: టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది.. సీఈసీకి బీజేపీ ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. ఈ అంశంపై రాష్ట్రంలోని ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేతృత్వంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధులు సంబిత్ పాత్ర, ఓం పాఠక్‌తో కూడిన నేతల బృందం బుధవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న అనైతిక విధానాలపై నేతలు ఫిర్యాదులు అందజేశారు.

ఈ భేటీ అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడుతూ మనుగోడు ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. పెద్ద ఎత్తున బోగస్ ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చడంతో పాటు అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పెద్ద ఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని అన్నారు. రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా వేలాది వాహనాలను నియోజకవర్గంలో తెరాసా నేతలు ఉపయోగిస్తున్నారని చెప్పారు.

ర్యాలీలు, సమావేశాలు, సభల కోసం ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుంటున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకపోతే సంక్షేమ అభివృద్ధి పథకాలు అపేస్తామంటూ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఓటర్లను బెదిరిస్తున్నారని అన్నారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి సభలు, ర్యాలీలకు అంతరాయం కలిగించడమే కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. మొత్తం అన్ని విషయాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి పలుమార్లు పదేపదే ఫిర్యాదు చేశామని, కానీ ఆయన వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఆరోపించారు.

- Advertisement -

ఎన్నికల అక్రమాలను నియంత్రించేందుకు మైక్రో జనరల్ అబ్జర్వర్లను, మైక్రో పోలీస్ అబ్జర్వర్లను నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్టు తెలిపారు. మద్యం, ధన ప్రవాహాన్ని అడ్డుకోవటం కోసం పోలీస్ చెక్ పోస్ట్ ల వద్ద కేంద్ర బలగాలను మొహరించాలని కూడా కోరినట్టు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత భద్రతను పెంచాలని, అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద కేంద్ర బలగాలను ఏర్పాటు చేయాలని కోరినట్టు వెల్లడించారు. ప్రతి పోలింగ్ బూత్‌లోను వీడియోగ్రఫీ, వెబ్ కాస్టింగ్ చేయాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement