Sunday, October 13, 2024

Modi: కెన్యాకు భార‌త్ 25 కోట్ల డాలర్ల రుణం

కెన్యా వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించేందుకు భారత్ 250 మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. కెన్యా అధ్యక్షుడు విలియం సమోయి రూటోతో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మూడు రోజుల భారత్ పర్యటనలో భాగంగా ఇవాళ కెన్యా అధ్యక్షుడు, ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.

ఇరు దేశాల రక్షణ పరిశ్రమలను అనుసంధానం చేయడంతోపాటు మానవ సంక్షేమం కోసం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంపై దృష్టి సారించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. హిందూ మహాసముద్ర దేశాల్లో సముద్ర భద్రత, పైరసీ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రధానంగా చర్చించినట్లు చెప్పారు. ఈ అంశంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేందుకు సముద్ర సహకారానికి సంబంధించి జాయింట్ విజన్ స్టేట్‌మెంట్‌ను జారీ చేస్తున్నట్లు వివరించారు. రూటోతో చర్చల అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ భారత్ తన విదేశీ విధానంలో ఆఫ్రికాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గత దశాబ్ద కాలంగా ఆఫ్రికాతో సంబంధాలను మరింత పటిష్టం చెందాయని తెలిపారు. కెన్యా అధ్యక్షుడి భారత పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడమే కాక ఆఫ్రికాతో భారత్ సంబంధాలలో నూతన అధ్యాయం ప్రారంభమవుతుందని మోడీ అన్నారు.

వ్యవసాయ రంగంలో ఆధునీకరణ కోసం కెన్యాకు 25 కోట్ల డాలర్ల రుణాన్ని భారత ప్రభుత్వం అందచేస్తుందని ఆయన తెలిపారు. మానవాళి ఎదుర్కొంటున్న పెను సవాలు తీవ్రవాదమని తమ రెండు దేశాలు భావిస్తున్నాయని, తీవ్రవాదాన్ని నిరోధించడంలో పరస్పర సహకారానికి రెండు దేశాలు అంగీకరించాయని ప్రధాని మోడీ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement