Monday, May 20, 2024

Delhi | బీసీ సీఎం! ఇదే బీజేపీ నినాదం.. రేపే కమలం జాబితా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ఎజెండాతో ముందుకెళ్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్నికలకు ముందు ‘బీసీ సీఎం’ నినాదాన్ని ప్రకటించనున్నట్టు తెలిసింది. అభ్యర్థి ఎవరన్నది చెప్పకుండానే.. రాష్ట్ర జనాభాలో అత్యధిక జన సంఖ్య కల్గిన బీసీ సమూహం నుంచి ముఖ్యమంత్రిని చేస్తామంటూ ఆ పార్టీ అగ్రనాయకత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు ఇచ్చిన టికెట్ల కంటే ఎక్కువ సీట్లే తాము ఇస్తామంటూ ప్రకటిస్తున్న కమలదళ నేతలు, బీసీ ఓటుబ్యాంకును తమవైపు ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

రాష్ట్రంలో ఎన్నికలను ముక్కోణపు పోటీగా మార్చేందుకు సరికొత్త ఎత్తుగడలతో ముందుకెళ్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే స్వయంగా బీసీ అన్న విషయాన్ని పలు వేదికలపై చెబుతున్న ఆ పార్టీ నేతలు, బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత, కేంద్ర మంత్రివర్గంలో అత్యధిక సంఖ్యలో బీసీలకు చోటు, బీసీ కులవృత్తులకు ఆసరా కల్పించే పీఎం-విశ్వకర్మ వంటి పథకాల గురించి కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

- Advertisement -

ఇప్పుడు తెలంగాణలో అధికారం సాధించాలంటే బీసీలను మరింత ఆకట్టుకోవాల్సిందేనని, పైగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో బీసీ నేతలకు తగినంత ప్రాధాన్యత, ప్రాతినిధ్యం దక్కడం లేదన్న ఆవేదన బీసీ వర్గాల్లో ఉన్నందున, దాన్ని తాము అనుకూలంగా మలచుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ క్రమంలో బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని సైతం తెరపైకి తీసుకురావాలన్న ఆలోచనలో కాషాయ దళపతులు ఉన్నట్టుగా తెలుస్తోంది.

బీసీలతో పాటు జనాభాలో సగభాగం ఉన్న మహిళలను ఆకట్టుకునేందుకు కూడా ఆ పార్టీ ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ల బిల్లును పాస్ చేసిన ఘనత తమదేనంటూ ఎలుగెత్తి చాటుకుంటున్న బీజేపీ, టికెట్ల కేటాయింపులోనూ తగినంత ప్రాతినిధ్యం, ప్రాధాన్యత కల్పించనున్నట్టు తెలుస్తోంది. బీసీలు, మహిళలకు ప్రాధాన్యతనిస్తూ అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరిగినట్టు తెలిసింది. ఢిల్లీలో వరుసగా రెండ్రోజుల పాటు బీజేపీ కోర్ కమిటీ నేతలు మంతనాలు సాగించారు.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవడేకర్ నివాసంలో, పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా నివాసంలో సమావేశాలు జరిగాయి. శుక్రవారం రాత్రి గం. 7.30కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించారు. ఈ మూడు రాష్ట్రాల కోర్ కమిటీ నేతలు బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన భేటీలో పాల్గొన్నారు.

తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, డా. కే. లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితాలో 60-70 మంది పేర్లు ఉండవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీ అనంతరం మూడు రాష్ట్రాల అభ్యర్థుల జాబితాలను బీజేపీ హెడ్‌క్వార్టర్స్ నుంచి విడుదల చేయనున్నారు. మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేయగా, తాజా కసరత్తులో మరో 50 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్టు తెలిసింది.

తెలంగాణపై జరిగిన కసరత్తులో మిత్రపక్షం జనసేనకు కూడా కొన్ని సీట్లను సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. గతంలో జరిగిన ఎన్నికల్లో జనసేన తరఫున అభ్యర్థులను పోటీ చేయించకుండా నేరుగా బీజేపీకి ఆ పార్టీ మద్దతు ప్రకటించింది. అయితే ఈసారి తమకు కొన్ని సీట్లు కావాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పట్టుబట్టినట్టు తెలిసింది. ఈ క్రమంలో బీజేపీ బలహీనంగా ఉన్న ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కొన్ని సీట్లను ఆ పార్టీకి కేటాయించనున్నట్టు తెలిసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement