Monday, May 20, 2024

భార‌త్ లో పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్ వీలినానికి ఇదే మంచి స‌మ‌యం..

న్యూఢిల్లి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి భారత్‌లో విలీనం చేసుకునేందుకు ఇదే మంచి సమయం. ఇప్పుడు ఆ ప్రాంతంలోని ప్రజలు కూడా భారత్‌లో విలీనానికి పట్టుబడుతున్నారు. తమ ఆర్థిక దుస్థితికి, పేదరికానికి పాక్‌ పాలకుల అవినీతి, ఆశ్రీతపక్షపాతాలతోపాటు ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన తీరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఎదుర్కొంటున్న తరహాలోనే పాక్‌ కూడా తీవ్ర ఆర్థికమాంద్యానికి లోనైంది. అంతర్జాతీయ రుణాల్ని తిరిగి చెల్లించలేని దుస్థితిని ఎదుర్కొంటోంది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. దిగుమతులకు తగిన నిధులు అందుబాటులో లేవు. ఇది దేశంలో తీవ్రఆహార కొరతకు దారితీసింది. చమురు, విద్యుత్‌ అందుబాటులో లేవు. ఆహార, ఆర్థిక సంక్షోభంతో ఆదేశం కొట్టుమిట్టాడుతోంది. పాలకుల వైఫల్యాలే తమ దేశ దుస్థితికి కారణమంటూ పాక్‌ ప్రజలు మండిపడుతున్నారు. రోడ్డెక్కి పాలకులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అంతర్గత తిరుగుబాట్లు జరుగుతున్నాయి. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ పాలకులపై ఆగ్రహం పెల్లుబికుతోంది.

కాశ్మీర్‌లో విలీనం చేయాలంటూ ఉద్యమాలు
గత 75ఏళ్ళలో ఈ ప్రాంతంలో ఎలాంటి మౌలిక వసతులు ఏర్పాటు కాలేదు. ఇక్కడి ప్రజల బాగోగుల్ని పాక్‌ ప్రభుత్వం ఎప్పుడూ పట్టించుకోలేదు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌తో పాటు గిల్‌జిత్‌ బల్దిస్థాన్‌లలో అపార ఖనిజ సంపదలున్నాయి. వీటిని పాక్‌ పాలకులు తరలించుకుపోయారు. ఈ ప్రాంతంలోని భూముల్ని విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించారు. అయితే ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్‌ను నేరుగా ఇస్లామాబాద్‌కు తరలించారు. దీంతో యునైటెడ్‌ కాశ్మీర్‌ పీపుల్స్‌ నేషనల్‌ పార్టీ ఇటీవల పీవోకే, గిల్‌జిత్‌ బల్ధిస్థాన్‌లలో ప్రజాఉద్యమాన్ని నిర్వహిస్తోంది. పీవోకేకు స్వాతంత్య్రం కావాలంటూ ఆ ప్రాంత ప్రజలు డిమాండ్‌ మొదలెట్టారు. తమకు పాక్‌ అధీనంలో కొనసాగడం ఇష్టంలేదంటూ రోడ్డెక్కి మరీ నినదిస్తున్నారు. భారత్‌ అధీనంలోని కాశ్మీర్‌లో విలీనం చేయమంటూ డిమాండ్‌ చేస్తున్నారు. గతేడాది చివర్లో జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్‌ సమావేశం దృష్టికి కూడా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ ప్రజలు తమ డిమాండ్‌ను తీసుకెళ్ళారు. తమ ప్రాంతాన్ని పాక్‌ సైన్యం ఉగ్రవాద శిక్షణ శిబిరంగా వినియోగిస్తోందని, తమ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోందంటూ వీరు ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేశారు. పాక్‌ సైన్యం తమ మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతోందని ప్రశ్నిస్తే ఉగ్రవాదుల పేరిట చంపేస్తున్నారంటూ కూడా స్పష్టం చేశారు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో పాక్‌ సైన్యం కనుసన్నల్లోనే మహిళల అపహరణ యథేచ్ఛéగా సాగుతున్న విషయాన్ని కూడా ఐక్యరాజ్య సమితి దృష్టికి తెచ్చారు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో రోజులు నాలుగ్గంటలు మాత్రమే విద్యుత్‌ సరఫరా ఉంటుంది. విద్య, వైద్య సదుపాయాలేమాత్రం లేవు. అక్కడి యువతను పాక్‌ సైన్యం ఉగ్రవాదం వైపు మళ్లిస్తోంది. ఈ ప్రాంతంలో పాక్‌ అరాచకాల నుంచి తమను రక్షించాలంటూ వేడుకున్నారు. తమకు పాక్‌ అధీనంలో ఉండడం ఏమాత్రం ఇష్టం లేదని తేల్చిచెప్పేశారు. భారత్‌ అధీనంలోని కాశ్మీర్‌లో తమను విలీనం చేయమంటూ విజ్ఞప్తి చేశారు.

భారత్‌ దూకుడుగా వ్యవహరిస్తేనే…
ప్రస్తుతం పాకిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత్‌ మరింత దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరాన్ని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. దేశ విభజన నాటి నుంచి పాక్‌ భారత్‌తో తీవ్ర శత్రుత్వాన్నే అనుసరిస్తోంది. ఏమాత్రం భారత్‌ను దాయాది దేశంగా భావించి గౌరవించలేదు. ప్రతి అంశంలోనూ భారత్‌పై కాలుదువ్వింది. ఇప్పటికేకంగా నాలుగు సార్లు భారత్‌పై యుద్ధానికి దిగింది. 1965, 1971, 1975, 1999లలో కాలు దువ్విన ప్రతిసారి పాక్‌ భారత్‌ చేతిలో గట్టిగానే దెబ్బతింది. అయినా పాక్‌ తన దుర్భుద్దిని ఏనాడూ వీడలేదు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను తప్పుబట్టే ప్రయత్నాన్ని కొనసాగిస్తోంది. అభూత కల్పనలతో భారత్‌పై ఆరోపణలకు దిగుతోంది. కాశ్మీర్‌ను రావణకాష్టంలా మార్చడంతో పాటు దీని చుట్టూనే పాక్‌ రాజకీయ క్రీడ కొనసాగిస్తోంది. 1947నుంచి ఏనాడూ పాక్‌లో ప్రజాస్వామ్యం లేదు. స్వీయ భౌగోళిక, రాజకీయ ప్రయోజనాల కోసం ఒకప్పుడు అమెరికా, ఆ తర్వాత చైనాల ముందు సాగిలపడింది. ఆసియాలో భారత్‌ను ఏకాకిని చేసేందుకు దుష్టప్రయత్నాలు చేపట్టింది. సుదీర్ఘకాలం పాక్‌ను పాలించిన సైనిక నియంతలు భారత్‌ను బూచిగా చూపుతూ తమ పబ్బం గడుపుకున్నారు. యుద్ధోన్మాదంతో సైనిక వ్యయాన్ని అనూహ్యంగా పెంచి ప్రజాసంక్షేమాన్ని పాక్‌పాలకులు గాలికొదిలేశారు. ఈ కారణంగానే ప్రపంచంలోనే అత్యంత అవినీతి, వెనుకబడ్డ దేశంగా పాక్‌ నిల్చిపోయింది. ప్రపంచమంతా ద్వేషించే దేశాల్లో ఒకటిగా మారింది. వ్యూహాత్మక భౌగోళిక రాజకీయ కారణాల రీత్యా ప్రపంచ వ్యాప్తంగా అపఖ్యాతి మూటగట్టుకుంది. అవాంఛనీయ విభజనానంతరం భారత్‌ ఏనాడూ వెనక్కి తిరిగి చూడలేదు. ఏ రంగంలోనూ భారత్‌ పాక్‌ను తన పోటీదారుగా లేదా సమఉజ్జిగా పరిగణించలేదు. పలుమార్లు పాక్‌ను తీవ్రంగా అణిచేసే అవకాశాలొచ్చినా భారత్‌ తన పరిధిని దాటి ఎప్పుడూ వ్యవహరించలేదు. నాలుగు యుద్ధాల్లోనూ భారత్‌ విజయం సాధించినప్పటికీ అంతర్జాతీయ సరిహద్దుల్ని మార్చేందుకు ఏనాడూ ప్రయత్నించలేదు. 1971లో పాక్‌ను విడగొట్టి బంగ్లాదేశ్‌ ఏర్పాటు చేసిన సమయంలో కూడా భారత్‌ గెల్చిన పాక్‌ ప్రాంతాన్ని తిరిగి ఆ దేశానికి భారత్‌ అప్పగించింది. అప్పుడు కూడా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ను కబ్జా నుంచి విడిపించే ఆలోచన చేయలేదు. 1971 యుద్ధంలో భారత్‌ సైన్యం సుమారు 15,010 చదరపు కిలోమీటర్ల పాక్‌ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. కానీ ఈ మొత్తం భూభాగాన్ని తిరిగి పాక్‌కు అప్పగించేసింది.

370వ అధికరణ సవరణ… ఓ మైలురాయి
కాగా మోడి రెండోసారి అధికారంలోకి రాగానే కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిస్తున్న 370వ అధికరణను సవరించారు. ఈ అధికరణం ద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాలకు వర్తించే నిబంధనలేవీ ఈ రాష్ట్రానికి వర్తించేవికాదు. రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార వ్యవహారాలు తప్ప మిగిలిన చట్టాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండేవి. ఆఖరకు అంతర్గత సమస్యల సమయంలో కూడా అక్కడ రాష్ట్రపతి పాలన విధింపునకు ఖచ్చితంగా ఆ రాష్ట్ర అసెంబ్లిd ఆమోదం అవసరమయ్యేది. కాశ్మీర్‌కు ఓ ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక జెండా, పీనల్‌కోడ్‌లుండేవి. ఆ రాష్ట్ర ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం లభించేది. కాగా 370రద్దుతో కాశ్మీర్‌ కూడా భారత భూభాగంలో ఒకటిగా మారింది.

- Advertisement -

అదే స్ఫూర్తితో పీవోకే స్వాధీనం చేసుకోవాలి
ఇప్పుడు అదే స్ఫూర్తితో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌ స్వాధీనం చేసుకోవాలి. ఒకప్పుడు ఇదంతా కాశ్మీర్‌లో భాగం. అఖండ భారత్‌కు స్వాతంత్య్రాన్ని ప్రకటించే సమయంలో బ్రిటీష్‌ ప్రభుత్వం వ్యూహాత్మకంగా దేశ విభజనకు తెరదీసింది. అప్పటికి దేశంలోని స్వతంత్య్ర రాజ్యాలు, సంస్థానాలకు భారత్‌ లేదా పాక్‌ల్లో ఇష్టమైన దేశంలో విలీనమయ్యే అవకాశాన్ని కల్పించారు. కాశ్మీర్‌ రాజు తన నిర్ణయాన్ని ప్రకటించక ముందే పాక్‌ సైన్యం కాశ్మీర్‌పై దాడి చేసింది. సగానికి పైగా భూ భాగాన్ని హస్తగతం చేసుకుంది. ఆ తర్వాత కాశ్మీర్‌ రాజు భారత్‌కు అనుకూలంగా తన సమ్మతి తెలిపారు. అప్పటికే సగ భాగం పాక్‌ అధీనంలో ఉండడంతో దాన్ని ఇప్పటికీ భారత్‌ పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌గా పేర్కొంటోంది. కాగా పాకిస్థాన్‌ అదే భూభాగాన్ని అజాదీ కాశ్మీర్‌గా పిలుస్తోంది. పేరుకు దీన్నొక ప్రత్యేక దేశంగా పాకిస్థాన్‌ పరిగణిస్తోంది. ఆ ప్రాంతానికి ఓ ప్రధాని, ఓ పార్లమెంట్‌ ఉంటాయి. కానీ అవన్నీ పాక్‌ అదుపాజ్ఞల్లోనే పనిచేస్తాయి. ఈ ప్రాంతాన్నే పాక్‌ తన ఉగ్రవాద శిబిరాల ఏర్పాటుకు వినియోగించుకుంటోంది.

భౌగోళికంగానూ భారత్‌కు రక్షణ
ఈ ప్రాంతాన్ని భారత్‌ స్వాధీనం చేసుకోవడం, దేశ భవిష్యత్‌ భద్రతా అంశాలకు మేలు కలిగిస్తుంది. బీజింగ్‌తో గతకొన్నేళ్ళుగా ఇస్లామాబాద్‌ బంధం పెరిగింది. భారత్‌పై చైనా అక్కసు పెంచుకుంటోంది. భారత్‌ను సైనిక లక్ష్యంగా ఎంచుకున్న చైనా… భారత్‌ తలచుట్టూ తన సైనిక కారిడార్‌ను ఏర్పాటు చేసుకుంది. ఇందుకు పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ ఆ దేశానికి కలిసొచ్చింది. పీవోకే మీదుగానే బీజింగ్‌ విస్తృతమైన కనెక్టివిటీ కారిడార్‌ ఏర్పాటు చేసుకుంది. తద్వారా పాక్‌లో చైనా సైనిక స్థావరాల ఏర్పాటుకు మార్గం ఏర్పడింది. ఈ దశలో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి భారత్‌ స్వాధీనం చేసుకుంటే పాక్‌-చైనాల నుంచి ఏర్పడ్డ ప్రధాన భౌగోళిక రక్షణ సమస్యల నుంచి భారత్‌ బయటపడగలిగే అవకాశముంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement