Friday, May 17, 2024

బ‌దిలీల‌కు వేళాయే…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో ఎన్నికల వేడి ప్రారంభా నికి ముందుగానే అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని కేసీఆర్‌ సర్కారు నిర్ణయించింది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యోగులందరికీ సమూలంగా స్థానచలనం కల్పించేదుకు ప్రభుత్వం నుంచి అంతర్గత మార్గదర్శకాలు వెలువడ్డాయి. మూడేళ్ళ గరిష్ట కాలపరిమితి విధిస్తూ.. ఒకేచోట పనిచేసిన వారందరినీ విధిగా బదిలీ చేసేందుకు జిల్లా కలెక్టర్లు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. ఇటు రాష్ట్రస్థాయిలోనూ అవే నిబంధనలతో త్వరలోనే బదిలీల పర్వం మొదలుకానుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయి స్థితిగతులపై సంపూర్ణ అవగా హన, నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉండే రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్‌ శాఖల్లో విధిగా మూడేళ్లు ఒకేచోట పనిచేసిన ప్రతి ఉద్యోగినీ బదిలీ చేయాలన్న కోణంలో జిల్లాస్థాయి విభాగాధిపతులు జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు వచ్చే నెలలో (జూన్‌లో) మార్గదర్శకాలు విడుదల చేసి, ఆ వెంటనే బదిలీలు చేపట్టాలని కలెక్టర్లు నిర్ణయించారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు మొదటి ప్రాధాన్యతగా రెవెన్యూ శాఖను ఎంచుకుని సమూలంగా మార్పులు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఆ తర్వాత పోలీసు, పంచాయతీరాజ్‌, తదితర శాఖల్లో బదిలీలు మొదలు కానున్నాయి. సర్కారు లిస్టులో ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ తదితర కేంద్ర సర్వీసు అధికారులు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న అదనపు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, డిప్యూటీ సెక్రటరీలు, సహాయ కార్యదర్శులు కూడా ఉన్నట్లు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయం నుంచి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

ఇప్పటికే ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో అంతర్గతంగా కసరత్తు జరుగుతోంది. మూడేళ్లకు పైగా ఒకేచోట పనిచేస్తున్న వారి జాబితాల రూపకల్పన తుది దశకు చేరుకున్నట్లు ప్రభుత్వోద్యోగ వర్గాలు చెబుతున్నాయి. గతంలో పైరవీలతో ఒకేచోట తిష్టవేసిన క్ష్రేతస్థాయి అధికారులపై, డిప్యుటేషన్‌పై ఏళ్ళ తరబడి పనిచేస్తున్న అధికారులపై ఇతర శాఖల అధికారులపై కూడా తప్పనిసరిగా బదిలీలతో వేటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియ త్వరలో ప్రారంభమయ్యే అసెంబ్లీ ఎన్నికల కసరత్తుకు సర్కారు సిద్ధమవుతున్నట్లు సంకేతాలనిస్తోంది.

సొంత జిల్లాల్లో పోస్టింగులకు నో ఛాన్స్‌..
ఆయా జిల్లాల్లో ప్రధానంగా పోలీసు, రెవెన్యూ శాఖల్లోని అధికారులే ఎన్నికల్లో కీలకంగా ఉండటంతో ఈ రెండు శాఖలపై దృష్టి సారించారు. పోలీసు శాఖలో ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీ, ఏఎస్పీ తదితరులు మూడేళ్లపాటు- ఒకే జిల్లాలో పనిచేస్తుంటే వీరికి స్థానచలనం తప్పదని సమాచారం. అలాగే ఆర్డీవోలు, తహసీల్దార్లతో పాటు- ఇతర ఉన్నతాధికారులకు కూడా ఇది వర్తిస్తుంది. ఎన్నికల నిర్వహణలో ఇతర శాఖ అధికారుల పాత్ర కూడా కీలకం కానుండటంతో ఈ నిబంధనను వారికి కూడా వర్తింపజేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

జిల్లా స్థాయి అధికారులు కూడా..
ఎన్నికల నేపథ్యంలో మూడేళ్ల నిబంధన అన్ని స్థాయిల్లోనూ వర్తిస్తుందని ఉన్నతాధికారులు పేర్కొంటు-న్నారు. జిల్లా స్థాయి అధికారులు కూడా బదిలీల జాబితాలో ఉన్నారని సంకేతాలిస్తున్నారు. మూడేళ్ల కాలపరిమితి ముగిసిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, డీఆర్‌వోలు, పంచాయతీ అధికారులు, జిల్లా పరిషత్‌ సీఈవోలు, సీపీవోలు, ట్రెజరీ అధికారులు, ఆర్డీవోలు ఎన్నికల నేపథ్యంలో బదిలీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అనేక శాఖల్లో సుమారు ఏడేళ్లుగా ఒకేచోట ఉండటంతో ఆ అధికారుల పేర్లు తప్పనిసరిగా బదిలీల జాబితాలో ఉండే చాన్స్‌ ఉంది.

- Advertisement -

పోస్టింగుల కోసం లాబీయింగ్‌ షురూ..
బదిలీలను అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. పొరుగు జిల్లాలో పనిచేస్తున్న తమకు అనుకూలమైన అధికారులను తమ నియోజకవర్గానికి బదిలీ చేయించేందుకు లాబీయింగ్‌ మొదలు పెట్టినట్టు- తెలుస్తోంది. అలాగే ఎన్నికల్లో పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులే కీలకం కావడంతో ఆర్‌ఐలు, తహసీల్దార్లు, ఆర్డీవోలు, ఎస్‌ఐలు, సీఐలు, డీఎస్పీలు తమ వారే ఉండాలనే ఉద్దేశంతో ముందస్తు బదిలీలు కూడా చేయించుకుంటు-న్నారనే ప్రచారం ఉంది. గతంలో జిల్లాలో పనిచేయని అధికారులను గుర్తించి తమ నియోజకవర్గానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా తమ సామాజికవర్గానికి చెందిన అధికారులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత ఎన్నికల్లో సహకరించేందుకు ముందుకు వస్తున్న అధికారులకు ప్రాధాన్యత ఇస్తూ పోస్టింగులు ఇప్పించుకునేందుకు స్థానిక నేతలు తమకున్న పరపతితో లాబీయింగ్‌ చేస్తున్నారు. బదిలీల ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలు అవుతుండటంతో పలువురు అధికారులు పోస్టింగుల కోసం నేతల వద్దకు క్యూ కడుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికల బదిలీల ప్రక్రియ అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తుండడంతో జిల్లాల్లో రాజకీయ హడావిడి మొదలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement