Saturday, April 20, 2024

సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ రైలు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. ఏప్రిల్‌ 8 నుంచి ట్రాక్‌పై పరుగులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలుగు రాష్ట్రాల్లో మరో వందే భారత్‌ రైలు పట్టాలెక్కనుంది. ఇప్పటికే సికింద్రాబాద్‌-విశాఖ మధ్య నడుస్తున్న వందేభారత్‌కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందేభారత్‌ రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 8న ఈ రైలును రైల్వే శాఖ అధికారులు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి రూట్‌ను కూడా ఖరారు చేశారు. రైలు వేళలను మాత్రం ఖరారు చేయాల్సి ఉంది. ప్రస్తుతం సికింద్రాబాద్‌-తిరుపతి మార్గంలో పలు రైళ్లు ఉన్నప్పటికీ రద్దీ ఎక్కువగా ఉంటోంది.

ఈ మార్గంలో ఇతర రైళ్లలో దాదాపు 12 గంటల సమయం పడుతోంది. వందేభారత్‌ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణికులు ఆరు నుంచి ఏడు గంటల సమయంలోనే గమ్యస్థానానికి చేరుకునే వీలు కలుగుతుంది. గంటలకు 130 నుంచి 150 కి.మీ.ల వేగంతో దూసుకుని వెళ్లగల సామర్ధ్యం ఉన్న ఈ రైలు ప్రయాణ సమయంలో తట్టుకునే విధంగా ట్రాక్‌ల పటిష్టతను రైల్వే శాఖ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.

- Advertisement -

కాగా, వందేభారత్‌ రైలులో సికింద్రాబాద్‌-తిరుపతికి కనీస ధర రూ.1150గా ఉండనుంది. వందేభారత్‌ రైలు సికింద్రాబాద్‌-బీబీనగర్‌-నల్గొండ-గుంటూరు-తెనాలి-నెల్లూరు మీదుగా తిరుపతి చేరుకోనుంది. వందేభారత్‌ సికింద్రాబాద్‌-తిరుపతి రైలును ఏప్రిల్‌ 8న ప్రారంభించడానికి నిర్ణయించినందున ట్రాక్‌, కోచ్‌ల నిర్వహణతో పాటు ఇతర ఏర్పాట్లు కూడా చేయాలని తమకు ఆదేశాలు అందినట్లు ద.మ.రైల్వే అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement