Saturday, May 11, 2024

ఈసారి వర్షాలు తక్కువే.. ప్రైవేట్‌ వాతావరణ ఏజెన్సీ స్కైమెట్‌ సూచన

ఈ ఏడాది వర్షకాలంలో వర్షపాతం సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ప్రైవేట్‌ వాతావరణ ఏజెన్సీ స్కైమెట్‌ సూచించింది. వర్షాకాలంలో ఆసియా ఖండంపై ఎల్‌నినో చూపించే పెను ప్రభావం వర్షపాతాన్ని తగ్గిస్తుందని తెలిపింది. ఈ సంవత్సరం జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు కొనసాగే వర్షాకాలంలో 868.6 మి.మీ.ల వర్షపాతంతో సాధారణం కన్నా తక్కువ వర్షపాతాన్ని స్కైమెట్‌ అంచనా వేసింది. ఎల్‌నినో తీవ్రతకు భారత్‌లో వర్షపాతం తగ్గిపోవడంతో పాటుగా దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో కరవు పరిస్థితులకు దారి తీస్తుందని తెలిపింది. రైతుల్లో అత్యధికులు వర్షకాలంలో పంటల పెరుగుదలకు వర్షాలపై ఆధారపడుతుంటారు.

అలాంటి సమయంలో ముంచుకువచ్చే ఎల్‌నినో వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఉత్తర భారతానికి ధాన్యాగారంగా పేరొందిన పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో వర్షాకాలం రెండవ భాగంలో సాధారణం కన్నా తక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని స్కైమెట్‌ సూచించింది. దేశంలో ఉత్తర, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ళ వానలు గోధుమ లాంటి చేతికందిన పంటలను దెబ్బ తీశాయి. వేలాదిగా రైతులను నష్టపరిచాయి. ఎల్‌నినో ప్రభావానికి ఈశాన్య భారతంలో వరదలకు, కొండచరియలు విరిగిపడటానికి దారి తీస్తుందని వాతావరణ ఏజెన్సీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement