Thursday, May 2, 2024

సన్న వడ్లకు ధర లేదు.. దోపీడీ చేస్తున్న వ్యాపారులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సన్న రకం ధాన్యం కొనుగోలు చేసేవారు కరువయ్యారు. ప్రతి సీజన్‌లో రైతులకు పెద్ద ఎత్తున రాబడిని తెచ్చే సన్న రకాలు ఈ సీజన్‌లో రైతులకు కష్టాలే మిగిల్చాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్న రకం ధాన్యాన్ని కొనడం లేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు ప్రయివేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రయివేటు వ్యాపారులు సన్నరకం ధాన్యానికి బాగా ధర తగ్గించారు. క్వింటా సన్న ధాన్యానికి రూ.1650 నుంచి రూ.1700 వరకే వ్యాపారులు ధర పెడుతున్నారు. ఈ ఏడాది యాసంగి ధాన్యం కొనుగోలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం తొలుత చేసిన ప్రకటనతో చాలా మంది మంచి ధర వస్తుందేమోనని సన్నరకం ధాన్యాన్ని సాగు చేశారు. ఈ ఏడాది యాసంగంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 35శాతం పైగా వరి సాగులో సన్నాలు ఆక్రమించాయి.

రాష్ట్రంలో ప్రతి ఖరీఫ్‌ సీజన్‌లో ఎక్కువగా సన్న రకం వరి ధాన్యం సాగవుతుంటుంది. బీపీటీ, హెచ్‌ఎంటీ, జై శ్రీరాం, శ్రీరామ, కావేరి, శ్రీ101లాంటి సూపర్‌ ఫైన్‌ రకాలను తెలంగాణ రైతులు సాగు చేస్తుంటారు. గత ఏడాది సూపర్‌ఫైన్‌ వరి ధాన్యానికి రూ. 2400 దకా ధర పలికింది. హైదరాబాద్‌, మిర్యాలగూడ, కరీంనగర్‌, వరంగల్‌తోపాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర , కర్ణాటక నుంచి వ్యాపారులు, మిల్లర్లు పోటీపడి పొలాల్లోనే ఖరీదు చేసి ధాన్యం తీసుకెళ్లేవారు. అయితే ఈ ఏడాది పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. గతేడాది బహిరంగ మార్కెట్లో సన్నరకం ధాన్యానికి రూ.2300 దాకా మార్కెట్‌లో మంచి ధర ఉండేది. ఈ ఏడాది రూ.1700 కే వ్యాపారులు అడుగుతున్నారు. దీంతో సన్నాలు పండించిన రైతులకు కనీస మద్దతు ధర కూడా రావడం లేదు.దీంతో సన్నాలకు గిట్టుబాటు ధర ఇప్పించాలని, మద్దతు ధర రూ.2300 చెల్లించేలా వ్యాపారులను నియంత్రించాలని రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రైతులు రోడ్డెక్కుతున్నారు. గతేడాది మాదిరిగానే నష్టానికి అమ్ముకున్న తర్వాత సన్న ధాన్యానికి రెక్కలు వస్తాయని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.ఇ దంతా వ్యాపారులు కావాలని చేస్తున్న పనేనని స్పష్టం చేస్తున్నారు. దున్నకం ఖర్చులు, యూరియా తదితర కాంప్లెక్స్‌ ఎరువుల ఖర్చులు పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో గిట్టుబాటు కాక సన్న ధాన్యం సాగు రైతుకు గుదిబండగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement