Saturday, May 11, 2024

అమ్మో, కారు మేఘాలలో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. ఫ్రాన్స్‌ పరిశోధనల్లో తేలిన నిజం

ఆకాశం మేఘావృతమై… నల్లమబ్బులు కనిపిస్తే చాలు రైతులు సహా చాలా సంబరపడిపోతారు. సేద్యానికి మేలు జరుగుతుందన్న ఆశలు మొలకెత్తుతాయి రైతుల్లో. వర్షాకాలంలో.. ప్రత్యేకించి రుతుపవనాల వేళ, తుపానులు, వాయుగుండాలు ఏర్పడినప్పుడు… ఎటు చూసినా వేగంగా కదులుతూ భారీ వర్షాలను మోసుకొచ్చే కరిమబ్బులు కొందరికి అబ్బురంగా కనిపిస్తే.. మరికొందరికి మలయమారుతాలు తీసుకొచ్చే మేఘమాలలు. ఇక సాహితీవేత్తలకు.. ప్రకృతి ప్రేమికులకు ఆ నల్లనిమబ్బుల్లో తెలియని అందం కనిపిస్తుంది… అయితే, ఠాఠ్‌… అది నిజం కాదు.. ఆ నల్లమబ్బుల నిండా బ్యాక్టీరియా ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఆ మేఘాలు భూగోళాన్ని చుట్టేసి.. బ్యాక్టీరియాను వెదజల్లేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విస్తృత పరిశోధనల తరువాత ఆ విషయాన్ని బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. తమ పరిశోధనల ఫలితాలను ఏకంగా విఖ్యాత సైన్స్‌ జర్నల్‌ ”ద టోటల్‌ ఎన్విరాన్‌మెంట్‌” మార్చి సంచికలో ప్రచురించారు.

- Advertisement -

ఆ పరిశోధనల విషయాలను శాస్త్రవేత్తల బృంద సారధి ఫ్లోరెంట్‌ రొస్సీ వివరించారు. ఫ్రాన్స్‌, కెనడాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ నల్లమబ్బుల రహస్యాలపై విస్తృత పరిశోధనలు చేశారు. ఫ్రాన్స్‌ క్యూబెక్‌ సిటీలోని లావల్‌ యూనివర్శిటీ, క్లెర్‌మాంట్‌ ఆవెర్నే యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఆ కరిమబ్బుల్లోని బ్యాక్టీరియా యాంటిబైటిక్‌ ఔషధాలకు లొంగుతాయా లేదా అన్న విషయంపై పరిశోధనలు చేశారు. మధ్య ఫ్రాన్స్‌లోని ”పుయె డె డోమ్‌” అగ్నిపర్వతం సమీపంలో, సముద్రమట్టానికి 4806 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన వాతావరణ పరిశోధనా కేంద్రం కరిమబ్బుల్లోని నీటి అణువుల నమూనాలను సేకరించింది. 2019 సెప్టెంబర్‌ నుంచి 2021 అక్టోబర్‌ మధ్య ఈ నమూనాలను సేకరించి పరిశోధనలు నిర్వహించారు. వారి విశ్లేషణల ప్రకారం మిల్లిలీటర్‌ (నల్లమబ్బుల్లోని నీటి రేణువుల్లో) నీటిలో 330 నుంచి 30వేల రకాల బ్యాక్టీరియా ఉంది. సగటున ఒక మిల్లిమీటర్‌ నీటిలో 8వేల బ్యాక్టీరియా ఉందని తేలింది.

వీటిలో 29 ఉపరకాల బ్యాక్టీరియా యాంటీబైటిక్‌ ఔషధాలను తట్టుకోగలిగే రకానికి చెందినివిగా గుర్తించారు. కొన్ని తరాలుగా వాటి జన్యువుల్లో జరుగుతున్న ఉత్పరివర్తనాల వల్ల వాటికి ఆ శక్తి వచ్చినట్లు తేలింది. అలా బ్యాక్టీరియాతో నిండిన కరిమబ్బులు వర్షం కురిపించినప్పుడు ఆ బ్యాక్టీరియా నేలపైన, పాడిపంటలపైన పడి మనుగడ సాగిస్తుందని తెలిపారు. వాతావరణ పరిస్థితులవల్ల ఆ కారుమేఘాలు భూవాతావరణంలో ఎటునుంచి ఎటువైపునకైనా వెడతాయని, అందువల్ల ప్రమాదకర బ్యాక్టీరియా అలా పాకిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఔషధాలకు లొంగని బ్యాక్టీరియా వల్ల వ్యవసాయ రంగం తీవ్రంగా ప్రభావితమవుతుందని వారు హెచ్చరించారు. అయితే, అలా కారుమేఘాల్లో నక్కిన బ్యాక్టీరియాలో 5 నుంచి 50 శాతం వరకే జీవిస్తున్నాయని, ఇది కొంతనయమని వారు చెబుతున్నారు. ప్రజల ఆరోగ్యంపై అవి ఎంతమేర ప్రభావితం చేస్తాయన్న విషయంలో వారింకా ఒక నిర్ణయానికి రాలేదు. వాతావరణ సంబంధిత బ్యాక్టీరియా వల్ల మనుషులకు పెద్ద ప్రమాదం ఉందని, వర్షం కురిసినప్పుడు తడిస్తే ప్రమాదమేమీ ఉండదని మాత్రం చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement