Wednesday, May 29, 2024

Temperature: ఉత్త‌రాదిలో సూర్య ప్ర‌తాపం.. రాజ‌స్థాన్ లో 48.8 డిగ్రీల ఉషోగ్ర‌త‌లు

వ‌డదెబ్బ‌కు ఏకంగా 8మంది మృతి
పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో
నాలుగు రోజుల పాటు వ‌డ గాల్పులు
ద‌క్షిణాదిలో చ‌ల్ల బ‌డుతున్న వాతావ‌ర‌ణం
త‌మిళ‌నాడు, ఏపీ, తెలంగాణ‌లో వ‌ర్షాలు
హైద‌రాబాద్ లో నేడు వాన‌లు

ఉత్తరాదిలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. మధ్యలో వర్షాలతో ఎండల నుంచి ఉపశమనం దొరకగా రోహిణి కార్తె ప్రవేశిస్తున్న వేళ మళ్లీ ఎండలు మొదలయ్యాయి. రాజస్థాన్‌లోని బార్మర్‌లో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని ఐఎండీ చెప్పింది. రాజస్థాన్‌లోని బార్మర్లో గరిష్ట ఉష్ణోగ్రత 48.8° సెల్సియస్ గా నమోదైనట్లు తెలిపింది. ఈ ఎండల తీవ్రతకు దాదాపు 8మంది చనిపోయారని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం పూట రోడ్లపై వెళ్లే వాహనదారుల మాడు పగిలిపోతోంది. ఈ క్రమంలోనే.. రోడ్లపై ఎండలో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు ఉపశమనం కల్పించేందుకు అధికారులు జంక్షన్లలో గ్రీన్ మెష్‌లో షెడ్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పడినప్పుడు గ్రీన్ మెష్ వల్ల వచ్చే నీడ వాహనదారులకు ఎండ వేడి నుంచి ఒకింత ఉపశమనం దొరుకుతోంది. మరోవైపు కొన్నిచోట్ల రోడ్లపై నీళ్లు చల్లుతున్నారు.

ఈ క్రమంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో నాలుగు రోజుల పాటు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్రలలో కూడా ఎండల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్‌, గుజరాత్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో రానున్న ఐదురోజుల పాటు ఉష్ణోగ్రతలు 44డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణల్లో 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.

దక్షిణాదిన వర్షాలు..
ఉత్తరాది ఉక్కపోతతో అల్లాడుతుంటే ఇటు దక్షిణాదిన మాత్రం వర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ శాఖ‌ అంచనా వేసింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అటు అండమాన్ నికోబార్‌లోనూ వచ్చే వారం రోజుల పాటు ఎడతెగని వానలు కురుస్తుండొచ్చని స్పష్టం చేసింది. కేరళలో వాతావరణ విభాగ అధికారులు అప్రమత్తమయ్యారు. కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, పథనంతిట్ట జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. అక్కడి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కూడా రంగంలోకి దిగింది. వాతావరణం అనుకూలించని కారణంగా కేరళ కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రభావం పడనుంది. విమానాల రాకపోకల్లో ఆలస్యం జరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో వ‌ర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్‌ హెచ్చరికలు జారీచేశారు. కాగా గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36.4డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23.1డిగ్రీలు, గాలిలో తేమ 58శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement