Saturday, May 18, 2024

దేశంలో ఎస్‌యూవీలపై పెరుగుతున్న క్రేజ్..

కార్ల కొనుగోలుదారుల అభిరుచులు మారుతున్నాయి. ఒకప్పుడు చిన్న కార్లు అమ్మకాలు అత్యధికంగా ఉండేవి. వీటినే ఎంట్రీ లెవల్‌ కార్లు అని పిలుస్తారు. తక్కువ ధరలో లభించే ఈ కార్ల అమ్మకాలు మొత్తం అమ్మకాల్లో 50 నుంచి 60 శాతానికి పైగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. చిన్న కార్లపై కొనుగోలుదారులు ఆసక్తి చూపించడంలేదు. పెద్ద కార్లకు డిమాండ్‌ విపరీతంగా పెరుగుతున్నది. ముఖ్యంగా ఎస్‌యూవీల డిమాండ్‌ చాలా ఎక్కువగా ఉంది.

దీంతో అన్ని కార్ల తయారీ కంపెనీలు ఎస్‌యూవీలపై కేంద్రీకరించాయి. వీటిలో అనేక మోడళ్లను తీసుకు వస్తున్నాయి. స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌ (ఎస్‌యూవీ)లు హోదాకు గుర్తుగా మారుతున్నాయి. లగ్జరీ, కంఫర్ట్‌, ఆధునిక ఫీ చర్లు వీటి అమ్మకాలను పెంచుతున్నాయి. ప్రస్తుతం ఆఫీస్‌లక వెళ్లే వారు కూడా ఎస్‌యూవీల పట్ల మొగ్గు చూపుతున్నారు. ఇందులోనూ కంఫాక్ట్‌ ఎస్‌యూవీల అమ్మకాలు పెరుగుతున్నాయి.

హాచ్‌బ్యాక్‌, సిడాన్‌ కార్లకు డిమాండ్‌ రోజు రోజుకూ తగ్గిపోతున్నది. దేశంలో ఎస్‌యూవీల అమ్మకాలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. కార్ల కంపెనీలు ఎస్‌యూవీలపై కేంద్రీకరించాయి. వీటిని కంపెనీలు అందుబాటు ధరల్లోనే విక్రయిస్తున్నారు. ఫైనాన్స్‌ ఆఫ్షన్లు పెరిగాయి. ఆధునిక ఫీచర్లు మరో కారణం. దీంతో దేశంలో చిన్న కార్లు చిన్నబోతున్నాయి. వాటి అమ్మకాలు నెల నెల తగ్గిపోతున్నాయి. కంపెనీలు కూడా క్రమంగా చిన్న కార్ల ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. గతంలో మార్కెట్‌ రాజులుగా చిన్న కార్లు ఉండేవి.

అత్యధికులు వీటిని కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం కార్ల అమ్మకాల్లో సగానికిపైగా ఎస్‌యూవీలు ఉంటున్నాయి. ఐదు సంవత్సరాల్లో ఎస్‌యూవీల మార్కెట్‌ వాటా రెట్టింపు అయ్యింది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో విక్రయించిన 3,63,733 కార్లలో ఎస్‌యూవీల వాటా 52 శాతంగా ఉంది. 2022 సెప్టెంబర్‌లో మొత్తం అమ్మకాల్లో ఎస్‌యూవీల వాటా 43.6 శాతంగా ఉంది. సంవత్సర కాలంలోనే ఎస్‌యూవీల అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.

- Advertisement -

ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో మొత్తం కార్ల అమ్మకాల్లో ఎస్‌యూవీల వాటా 48.3 శాతంగా ఉంది. గత ఆర్ధిక సంవత్సరం ఇదే కాలంలో వీటి అమ్మకాల వాటా 41.5 శాతంగా ఉంది. అదే సమయంలో ఈ ఆర్ధిక సంవత్సరంలో హాచ్‌బ్యాక్‌ కార్ల అమ్మకాలు 30 శాతానికి తగ్గిపోయాయి. గత సంవత్సరం ఇదే కాలంలో హాచ్‌బ్యాక్‌ కార్ల అమ్మకాలు 35.1 శాతంగా ఉన్నాయి. సిడాన్‌ కార్ల అమ్మకాలు కూగా గణనీయంగా తగ్గాయి. ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో సిడాన్‌ కార్ల అమ్మకాలు 9.3 శాతంగా ఉన్నాయి.

గత ఆర్ధిక సంవత్సరం ఇదే కాలంలో వీటి అమ్మకాలు 10.3 శాతంగా ఉన్నాయి. మొదటిసారి కారు కొనుగోలు చేస్తున్న వారిలో ఎస్‌యూవీలు తీసుకుంటున్న వారి సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. ఎక్కువ గ్రౌండ్‌ క్లీయరెన్స్‌, లుక్‌ పరంగా బాగుండటం, కారులో ఎక్కువ స్పేస్‌, ఎక్కువ ఆధునిక ఫీచర్లు కోరుకునే వారు ఎస్‌యూవీలనే కొనుగోలు చేస్తున్నారు. గత పది సంవత్సరాలుగా చాలా మంది ఆదాయాలు పెరగడం కూడా ఎస్‌యూవీల అమ్మకాలు పెరిగేందుకు దోహదం చేస్తోంది.

మారుతున్న కస్టమర్ల అభిరుచుకు అనుగుణంగా కంపెనీలు కూడా రకరకాల ఎస్‌యూవీలను మార్కెట్‌లోకి తీసుకు వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు అనేక ఎస్‌యూవీ మోడల్స్‌ అందుబాటులో ఉన్నాయి. కంపెనీలు తమ పోర్టుఫోలియోలో ఎస్‌యూవీలకే పెద్ద పీట వేస్తున్నాయి. వీటి మూలంగా ఆదాయాలు పెరుగుతున్నాయి. ఎంట్రీ లెవల్‌ కారు ధర సాధారణంగా 4 లక్షల లోపుగానే లభిస్తుంది. అదే ఎస్‌యూవీల ధరలు కనీసం 10 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.

దేశంలో ఎస్‌యూవీలకు డిమాండ్‌ పెరగడానికి మన రోడ్ల కండిషన్‌ కూడా ఒక కారణం, రోడ్లు సరిగాలేనందు వల్ల చిన్నకార్లతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎస్‌యూవీలకు గ్రౌండ్‌ క్లీయరెన్స్‌ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రోడ్లు సరిగాలేకున్నా పెద్దగా ఇబ్బంది ఉండటంలేదు. దీనికి తోడు కుటుంబాల ప్రయాణాలు పెరిగాయి. ఏదైనా శుభకార్యాలకు వెళ్లినా, యాత్రలకు, హాలీడే ట్రిప్‌లకు వెళ్లినా కుటుంబం సభ్యులంతా కలిసి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు.

ఇలాంటి ప్రయాణాలకు ఎస్‌యూవీలు అనుకూలంగా ఉండటం కూడా వాటి అమ్మకాలు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. కంపెనీలు భద్రతా ప్రమాణాలు విషయంలోనూ మెరుగైన స్థితిలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాయ. దీని వల్ల కూడా కొనుగోలుదారులు ఎస్‌యూవీల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఎస్‌యూవీల అమ్మకాలు 2014లో మొత్తం అమ్మకాల్లో 1 శాతంగా ఉంటే, 2022-23 నాటికి 22 శాతానికి చేరినట్లు మారుతీ సుజుకీ మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాస్తవా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement