Wednesday, June 19, 2024

Delhi | పర్యాటక స్వర్గధామంలో జీ-20 టూరిజం సదస్సు.. 19 నుంచి రెండ్రోజుల పాటు సమావేశాలు

గోవా నుంచి ఆంధ్రప్రభ ప్రతినిధి

ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన గోవా జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ చివరి సమావేశాలతో పాటు జీ-20 టూరిజం మినిస్టర్స్ కాన్ఫరెన్సుకు సిద్ధమైంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న సమావేశాలకు గోవా దేశంలోనే అత్యుత్తమ పర్యాటక ప్రాంతమని కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి వి. విద్యావతి చెప్పారు. ఆదివారం గోవాలోని తాజ్ రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సుందరమైన బీచ్‌లకు, అద్భుత వారసత్వ సంపదకు, ప్రకృతి సౌందర్యానికి, ఎకో టూరిజంతో పాటు గొప్ప సంస్కృతితో కూడిన అనేక అనుభవాలకు వేదిక అని, అందుకే టూరిజం వర్కింగ్ గ్రూప్ చివరి సమావేశాన్ని నిర్వహించేందుకు ఎంపిక చేశామని వెల్లడించారు.

వర్కింగ్ గ్రూప్ ద్వారా విజయవంతమైన చర్చలు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తాయని, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంతో పాటు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తాయని తెలిపారు. జీ-20కు ఈ ఏడాది నాయకత్వం వహిస్తున్న భారత్.. పర్యాటక విభాగంలో గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్, స్కిల్స్, పర్యాటక రంగంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ అనే ఐదు అంశాలను ప్రాధాన్యంగా తీసుకుందని ఆమె వివరించారు. ఈ ప్రాధాన్యతలు 2030 వరకు నిర్దేశించుకున్న సుస్ధిరాభివృద్ధి లక్ష్యాలు సాధించడానికి కీలక సాధనాలని చెప్పారు. ముగింపు సమావేశంలో జీ-20 సభ్య దేశాలతో పాటు ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఖరారు చేసిన సంస్కరణలను స్వాగతించి ఆమోదిస్తాయని విద్యావతి ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

టూరిజం వర్కింగ్ గ్రూప్ నిర్దేశించుకున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఒక వాహనంగా గోవా రోడ్‌మ్యాప్, జీ-20 టూరిజం మంత్రుల ప్రకటన ఉంటుందని తెలిపారు. సైడ్ ఈవెంట్స్‌ గురించి మాట్లాడుతూ.. ‘మేకింగ్ క్రూయిజ్ టూరిజం ఎ మోడల్ ఫర్ సస్టైనబుల్ & రెస్పాన్సిబుల్ ట్రావెల్’ అనే థీమ్‌తో క్రూయిజ్ టూరిజంను ప్రోత్సహించే వ్యూహాలపై దృష్టి పెట్టినట్టు పర్యాటక శాఖ కార్యదర్శి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా క్రూయిజ్ టూరిజం అభివృద్ధిలో ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలపై ఈ కార్యక్రమంలో చర్చిస్తామని చెప్పారు. జూన్ 20న జరిగే ప్రధాన ఈవెంట్‌తో పాటు దేశంలో క్రూయిస్ టూరిజం అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్లు, అవకాశాలపై చర్చించేందుకు ‘మేకింగ్ ఇండియా ఏ క్రూయిజ్ టూరిజం హబ్’ అంశంపై దృష్టి సారిస్తూ జాతీయ స్థాయి సైడ్ ఈవెంట్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

క్రూయిస్ టూరిజం (కోస్టల్, ఐలాండ్, రీజినల్ మరియు యాచింగ్) యొక్క బహుళ కోణాలు, తీర రాష్ట్రాల దృక్కోణాలు, లోతట్టు జలమార్గాలలో ప్రైవేట్ – పబ్లిక్ వాటాదారులు, నదీతీర రాష్ట్రాల దృక్పథాలు ఈ కార్యక్రమంలో చర్చనీయాంశంగా ఉంటాయని చెప్పారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP)తో పాటు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWTO) సహకారంతో పర్యావరణంపై దృష్టి సారిస్తూ కొన్ని సైడ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. అలాగే జూన్ 21న గోవాలో పర్యాటక మంత్రిత్వ శాఖ, వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ సహకారంతో మరికొన్ని సైడ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు.

జూన్ 21న ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా గోవా రాష్ట్ర ప్రభుత్వం జీ-20 సమావేశాలతో సమాంతరంగా ప్రత్యేక యోగా సెషన్ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు విహారయాత్రలు, సందర్శనలు ఏర్పాటు చేసినట్టు విద్యావతి చెప్పారు. అందులో భాగంగా బసిలికా ఆఫ్ బోమ్ జీసస్, చర్చ్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి మరియు సే కేథడ్రల్, దిగువ అగ్వాడా ఫోర్ట్ మరియు జైలు మ్యూజియం వంటి ప్రాంతాలకు జీ-20 ప్రతినిధులకు తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. అలాగే కమ్యూనిటీ భాగస్వామ్య ప్రాముఖ్యతను సూచిస్తూ స్థానిక హస్తకళలు, కళాకారులను ప్రదర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బజార్లను నిర్వహిస్తోందని ఆమె వివరించారు.

జూన్ 20న జరగనున్న కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక, షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యశో నాయక్, కేంద్ర పర్యాటక మరియు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ప్రసంగిస్తాని అధికారులు తెలిపారు. సమావేశాల్లో భాగంగా ల్యాంప్ డాన్స్, కథక్, గోవా మాండో మ్యూజిక్ అండ్ డాన్స్, దేఖ్నీ డాన్స్, ముసల్ ఖేల్, గోమంత్ రంగ్ వంటి గోవా సాంస్కృతిక వారసత్వం చాటే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రతినిధులకు ఘన స్వాగతం

జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూపు సమావేశాలతో పాటు టూరిజం మంత్రుల సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. వారిని ఆహ్వానించేందుకు గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గోవా సంగీతం, నృత్యాలు, ఫ్లెమెన్కో ప్రదర్శనలతో ఘనస్వాగతం పలికారు. గోవా అంతటా జీ-20 పోస్టర్లు, ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement