Monday, April 29, 2024

ఉచిత హామీలపై పార్టీలను నియంత్రించలేం.. వరమో? శాపమో? ప్రజలే తేల్చుకోవాలి: ఈసీ

రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను నియంత్రించే అధికారం తమకు లేదని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఉచిత హామీలిచ్చే రాజకీయపార్టీలను రద్దుచేయాలంటూ బీజేపీ నేత అశ్వనీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్‌ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ అఫిడవిట్‌ దాఖలుచేసింది. ఉచిత హామీలపై రాజకీయ పార్టీలను నియంత్రించేందుకు చేసే ప్రయత్నం తమ అధికార పరిధిని అతిక్రమించినట్లు అవుతుందని తెలిపింది. చట్టంలో మార్పులు చేయకుండా మేము ముందడుగు వేయలేమని చెప్పింది. ఎన్నికలకు ముందు లేదా తర్వాత ఏదైనా ఉచితాలను అందించడం లేదా పంపిణీ చేయడం సంబంధిత పార్టీ విధాన నిర్ణయమని, అలాంటి విధానాలు ఆర్థికంగా లాభదాయకంగా ఉన్నాయా లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయా అనేది ఆ ఓటర్లు నిర్ణయించాలని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. 2016 డిసెంబర్‌లో, రాజకీయ పార్టీలకు సంబంధించిన సంస్కరణలకు సంబంధించి ఎన్నికల సంస్కరణలపై 47 ప్రతిపాదనలను కేంద్రానికి పంపామని, అందులో ఒక అధ్యాయం రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దుకు సంబంధించినది అని ఈసీ వివరించింది. రాజకీయ పార్టీని రిజిస్టర్‌ చేయడాన్ని, రద్దు చేయడానికి అవసరమైన ఉత్తర్వులను జారీచేసే అధికారాలకోసం న్యాయ మంత్రిత్వశాఖకు సిఫార్సులు చేయడం జరిగిందని పేర్కొంది.

ప్రజా ధనంతో ఉచిత హామీలు, కానుకలు పంపిణీ చేసే రాజకీయ పార్టీ గుర్తును రద్దు చేసేలా ఈసీని ఆదేశించాలని గతంలో పిటిషనర్‌ అశ్వనీకుమార్‌ కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీం కోర్టు 2002లో వెలువరించిన తీర్పును ఈ సందర్భంగా ఎన్నికల సంఘం ప్రస్తావించింది. మోసపూరితంగా రిజిస్ట్రేషన్‌ పొందడం, అర్ధంతరంగా పార్టీ నియమాలను సవరించడం, రాజ్యాంగంపై విధేయతను కోల్పోవడం వంటి మూడు సందర్భాలలో తప్ప ఎన్నికల గుర్తును రద్దుచేసే అధికారం ఈసీకి లేదని నాటి తీర్పులో పేర్కొన్నట్లు చెప్పింది. 1968 ఎన్నికల చిహ్నాల ఆర్డర్‌లో జాతీయ పార్టీల గుర్తింపు, రాష్ట్ర, జాతీయ పార్టీల గుర్తింపును కొనసాగించడం వంటి నిబంధనలు ఉన్నాయని కమిషన్‌ తెలిపింది. రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ప్రజా నిధుల నుండి ఉచితాలను వాగ్దానం చేయడం/పంపిణీ చేయకుండా నిరోధించే మరో షరతును చేర్చడం వల్ల తమ ఎన్నికల పనితీరును ప్రదర్శించకముందే పార్టీలు తమ గుర్తింపును కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఈసీ పేర్కొంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ మార్గదర్శకాలను రూపొందించినట్లు పోల్‌ ప్యానెల్‌ తెలిపింది.

కాగా, అహేతుకమైన ఉచితాలను వాగ్దానం చేయడం లేదా పంపిణీ చేసే రాజకీయ పార్టీ గుర్తును రద్దుచేయాలని కోరుతూ దాఖలైన మరొక పిటిషన్‌పై కేంద్రం, ఈసీ స్పందనలను న్యాయస్థానం కోరింది. ఇది తీవ్రమైన సమస్యని, కొన్నిసార్లు ఉచితహామీలు సాధారణ బడ్జెట్‌కు మించి ఉంటున్నాయని 2002 జనవరి 25 నాటి విచారణలో సుప్రీం అభిప్రాయపడింది. న్యాయవాది అశ్వనీ కుమార్‌ దూబే ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనికి సంబంధించి చట్టం చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement