Friday, February 23, 2024

AP | భారీ వ‌ర్షాల ఎఫెక్ట్.. పొంచి ఉన్న విద్యుత్‌ ప్రమాదాలు !

అమరావతి, ఆంధ్రప్రభ : అసలే వర్షాకాలం.. ఈ సమయంలో విద్యుత్‌ ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది. అయినా.. రాష్ట్రంలోని పలు జిల్లాలో విద్యుత్‌ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. స్తంభాలు ఒరిగి ఎప్పుడు పడిపోతాయో అన్నట్లు పరిస్థితి ఉన్నా.. పట్టించుకునే వారు లేకపోయారు. చాలా చోట్ల విద్యుత లైన్లు, స్తంభాలు ప్రమాదకరంగా ఉన్నాయి. కానీ ఆ శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నూతనంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, గ్రామీణ ప్రాంతాల్లో జూనియర్‌ లైనమ్యాన్ల ద్వారా సేవలు అందిస్తున్నా, స్థానికంగా ఉండే విద్యుత్‌శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పని చేయడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు సమయంలో విద్యుత్‌శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారానే చిన్నపాటి గాలి వస్తే చాలు..వందల సంఖ్యలో విద్యుత్‌ స్తంభాలు పడిపోతున్నాయి. అంతే కాదు చాలా చోట్ల విద్యుత్‌ స్తంభాలు శిథిలావస్థకు చేరుకొని వంగిపోవడం, వాటి తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారుతున్నాయి. ఎప్పుడో దశాబ్ధాల క్రితం వేసిన విద్యుత్‌ స్తంభాలను అధికారులు పట్టించుకోకపోవడంతో అవి ఎప్పుడు నేల కూలుతాయో తెలియక ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదకరంగా మారిన స్తంభాలను వేలాడుతున్న తీగలను బాగు చేయాలని స్థానికంగాఉండే అధికారులకు ప్రజలకు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేదని ప్రజలు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో పలు జిల్లాల్లో విద్యుత్‌ తీగలు తెగిపడటం తర చుగా జరుగుతోంది. గ్రామాలు, పంట పొలాల్లో విద్యుత్‌ తీగలు వేలాడుతూ విద్యుత్‌ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. స్తంభాలకు మధ్యలో ఇనుపచువ్వలు పైకి తేలాడుతూ..బలమైన గాలులు వీచినప్పుడు విద్యుత్‌ స్తంభాలు నేలకూలిపోతున్నాయి. రెండు రోజులపాటు బీభత్సాన్ని సృష్టించిన మిచౌంగ్‌ తుఫాన్‌ కారణంగా రాష్ట్రంలో విద్యుత్‌శాఖ తీవ్ర నష్టం వాటిల్లింది. 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయడంతో పలు జిల్లాలో వందల సంఖ్యలో విద్యుత్‌ స్తంభాలు నేలకొరగగా, వేల కిలోమీటర్ల మేర విద్యుత్‌ తీగలు తెగిపోయాయి. అంతే కాదు పలు సబ్‌ స్టేషన్లు నీటిలో తేలాడాయి.

నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, చిత్తూరు, పశ్చిమ, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయన గరం, బాపట్ల, శ్రీకాకుళం, పల్నాడు, తదితర జిల్లాల్లో 33 పోల్స్‌ 1000కి పైగా, 11 కేవీ పోల్స్‌ 3000లకు పైనే పడి పోవడంతో విద్యుత్‌ అంతరాయం కలిగింది. దశాబ్ధాల క్రితం ఏర్పాటు చేసిన స్తంభాలు గాలికి పడిపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో సుమారుగా రూ.40 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. హైటెన్షన్‌ విద్యుత్‌ స్తంభాలు, వైర్ల పటిష్టతను క్రమం తప్పకుండా తనిఖీ చేయడానికి వివిధ రాష్ట్రాల సమన్వయంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర విద్యుత్‌,నూతన పునరుత్పాదక ఇంధనశాఖ మంత్రి తెలియజేశారు.

విద్యుత్‌ చట్టం 2003 ప్రకారం, విద్యుత్‌ పంపిణీ అఏది లైసెన్స్‌ పొందిన కార్యకలాపం, దాని సరఫరా ప్రాంతంలో సమర్ధవంతమైన, సురక్షితమైన, ఆర్థిక పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేయడం, నిర్వహించడం సంబంధిత పంపిణీ సంస్థల విధి. అందువల్ల పంపిణీ వ్యవస్థ యొక్క అప్‌గ్రేడేషన్‌, నిర్వహణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవడం పంపిణీ వినియోగాల బాధ్యత, దాని ఆపరేషన్‌ ప్రాంతంలో నాణ్యమైన, విశ్వసనీయమైన విద్యుత్‌ సరఫరాను నిర్వహించడానికి హెచ్‌టీ/ ఎల్‌ టీ లైన్ల స్తంభాలు, వైర్లు పటిష్టతను తనిఖీ చేయాలి.

సీఈఏ నిబంధనలు..

సీఈఏ (భద్రత, విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన చర్యలు) నిబంధనలు 2023 పవర్‌ స్టేషన్లు, సబ్‌ స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ లైన్‌ల నిర్మాణం, ఆపరేషన్‌, నిర్వహణ కోసం భద్రతా చర్యలను పేర్కొంటంది. ఇది ఎలక్ట్రికల్‌ ఇన్‌స్టాలేషన్‌లు, ఓవర్‌హెడ్‌ లైన్‌లు, ఇతరులకు భద్రతా చర్యలను నిర్దేశిస్తుంది. ఎలక్ట్రికల్‌ ప్లాంట్లు, ఎలక్ట్రిక్‌ లైన్లు, విద్యుత్‌ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ, వ్యాపారం, సరఫరా లేదా వినియోగం వంటి కార్యకలాపాలలో పాల్గొన్న వ్యక్తులు లేదా సంస్థలను కలిగి ఉండే అన్ని ఎలక్ట్రికల్‌ ఇన్‌స్టాలేషన్‌లకు ఈ నిబంధనలు వర్తింపజేయబడతాయి.

అంతే కాదు సీఈఏ నిబంధనల ప్రకారం 2022 విపత్తు పీడిత ప్రాంతాలు, తీర ప్రాంతాలలో స్తంభాలు, వైర్లను బలోపేతం చేయడానికి ఈ నిబంధనలు వర్తిస్థాయి. ఇదిలా ఉండగా తీర ప్రాంతాలలో, రైలు స్తంభాలు లేదా స్పన్‌ పోల్స్‌ వంటి అధిక బలం గల స్తంభాలను ఉపయోగించాలి లేదా భూగర్భ కేబుళ్లను ఉపయోగించాలి. తుప్పు పట్టకుండా ఉండేందుకు తీర ప్రాంతాలలో బేర్‌ కండక్టర్లపై తగిన ఇన్సులేటింగ్‌ పెయింట్‌ అందించడం మంచిది. ఈ నెల 5వ తేదిన రాజ్యసభలో విద్యుత్‌ సమస్యల పై కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కేసింగ్‌ కూడా ఈ సమాచారాన్ని అందించారు.

ఎర్తింగ్‌ సరిగా లేకపోవడంతో ప్రమాదాలు…

ఇదిలా ఉండగా గ్రామాలు, రైతుల పొలాల్లో ఉన్న విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద సరైన ఎర్తింగ్‌ లేకపోవడంతో ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినప్పుడు కాంట్రాక్టర్‌ సరైన లోతు గుంతలు తీయకపోవడం, నాణ్యమైన సామాగ్రి వినియోగించకపోవడం, ఎర్తింగ్‌ వైర్లకు ముడి పదార్థాలు సరైన మోతాదులో వినియోగించకపోవడంతో ఎర్తింగ్‌ వచ్చి అధికంగా ప్రమాదాలు జరుగుతుంటాయి.

కొన్నిచోట్ల స్తంభాలకు సపోర్టుగా ఉన్న వైర్లకు సైతం విద్యుత్‌ సరఫరా అయి ఎన్నో మూగజీవాలు మృతిచెందుతున్నాయి. దీనికి కారణం ఎర్తింగ్‌ లోపమే అంటున్నారు అధికారులు. రైతులు ట్రాన్స్‌కో సిబ్బంది సూచనలు పాటించి తమ పొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్‌ర్ల వద్ద నాణ్యమైన ఎర్తింగ్‌ వైర్లు ఏర్పాటు చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎర్తింగ్‌ వైర్లు ఏర్పాటుకు ఏమైన ఇబ్బందులు ఉంటే ట్రాన్స్‌కో సిబ్బంది సహకారం తీసుకుంటే మంచిందని సూచిస్తున్నారు.

వానకాలంలో జాగ్రత్తలు…

వర్షం వచ్చిన సమయంలో విద్యుత్‌ స్తంభాలను తాకరాదు.నీటిలో పడిన విద్యుత్‌ వైర్ల జోలికి వెళ్లకూడదు.భవన నిర్మాణ పనులు చేసేటప్పుడు విద్యుత్‌వైర్లకు దూరంగా ఉండటంతో పాటు,తడి చేతులు, తడి బట్టలతో విద్యుత్‌ పరికరాలు ముట్టుకోకూడదు. మరమ్మతులు చేయవద్దు.పిల్లలకు అందేంత ఎత్తులో స్విచ్‌ బోర్డులు ఏర్పాటు చేయకూడదు.

రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

విద్యుత్‌ స్తంభం నుంచి వ్యవసాయ మోటరుకు మద్య దూరం ఎక్కవ దూరం ఉండకుండా చూసుకోవాలి. ఎక్కువ దూరం ఉంటే గాలులు వీచినప్పుడు వాటి మధ్య ఉండే సర్వీస్‌ వైరు వదులై మోటరుపై ప్రభావం చూపుతుంది.విద్యుత్‌ స్తంభం నుంచి మోటరుకు కరెంట్‌ నేరుగా సరఫరా కాకుండా మధ్యలో ప్యూజ్‌, బ్యాక్‌, స్టార్టర్‌ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలివిద్యుత్‌ సరఫరాలో లోఓల్టేజీని దృష్టిలో ఉంచుకుని సరైన ప్యూజును వేయాలి.మోటర్‌ వద్ద పూజ్‌లు ఇండికేటర్‌ బల్పులు, స్టార్టర్‌ను ఒక చెక్కపై బిగించుకోవాలి.

ఎట్టిపరిస్థిల్లో ఇనుప డబ్బాపై బిగించకూడదు.విద్యుత్‌ సరఫరాలో లోపం ఉంటే మెకానిక్‌తో మరమ్మతులు చేయించుకోవాలి. వర్షాలకు తెగిపడిన కరెంట్‌ తీగలకు, విరిగిన విద్యుత్‌ స్తంభాలకు విద్యుత్‌ సరఫరా అయితే వెంటన అధికారులకు తెలి యజేసి సరఫరా నిలిపి వేసేలా చర్యలుతీసు కోవాలి. వానకాలంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్‌ వైర్లు తెగిపడినా, నేలపై వాలిన ఎలాంటి మరమ్మతులు చేయరాదు. వెంటనే విద్యుత్‌ సిబ్బందికి సమాచారం అందించాలి. వ్యవసాయ బోర్లకు ఏదైనా పాత సర్వీస్‌ వైర్లు ఉంటే మార్చుకోవాలి. రైతులు మోటర్ల వద్దకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందితోనే పనులు…

రాష్ట్ర వ్యాప్తంగా తుఫానులు వచ్చినప్పుడు ముందుగా గుర్తుకొచ్చేది విద్యుత్‌శాఖ మాత్రమే! కానీ రెగ్యులర్‌ ఉద్యోగులు ఈ సమయంలో నిబద్దతతో పనిచేయాలి. కానీ క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నంగా జరుగుతుండటం గమనార్హం. విద్యుత్‌శాఖలో పని చేసే రెగ్యులర్‌ ఉద్యోగులకు, ఔట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్టు కార్మికులకు తుఫాన్‌ సమయంలో సెలవులు ఉండవు. ఏసీ గదుల్లో కూర్చొని ఆదేశాలు ఇచ్చే అధికారులు కార్మికుల ఉద్యోగ భ ద్రత పై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ప్రజలకు విద్యుత్‌ అంతరాయం కలగకూడదని ప్రభుత్వ, విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ సెలవులు పెట్టకుండా సబ్‌ స్టేషన్ల వద్ద, కాల్‌ సెంటర్స్‌లలో రాత్రింబగళ్లు తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ తమ ప్రాణాలను పణంగా పెట్టి విద్యుత్‌ ఉద్యోగస్తులు, ఔట్సోర్సింగ్‌ కాంటాక్ట్‌ కార్మికులకు సేవ చేస్తున్నారు. అటువంటి వారంతా రాష్ట్రవ్యాప్తంగా చాలీచాలని జీతాలతో అనేక సంవత్సరాలుగా విద్యుత్‌ శాఖలో ఔట్సోర్సింగ్‌ కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న సుమారు 23 వేల మందిని రెగ్యులరైజ్‌ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు.

అంతే కాదు తుఫాను సందర్భంగా భారీ వర్షాలతో గ్రామాలలో పట్టణాలలో చెట్టుకొమ్మలు విరిగి రోడ్డుపై పడే కరెంట్‌ తీగల కారణంగా పాదచారులకు ప్రాణనష్టం జరగకూడదని ఎప్పటికప్పుడు కరెంటు పోల్స్‌, పెద్ద పెద్ద ఎలక్ట్రిక్‌ టవర్‌లు ఎక్కి హైటెన్షన్‌ లైన్ల మరమ్మత్తులలో విద్యుత్‌ లైన్‌మాన్‌లకు, ఔట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు ఎటువంటి ప్రమాదాలు, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి సబ్‌ స్టేషన్‌ లలో, కాల్‌ సెంటర్స్‌లలో పని చేసే వారికి రైన్‌కోట్స్‌,హ్యాండ్‌ గ్లౌజ్స్‌,గమ్‌ భూట్స్‌,ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్స్‌ లాంటి సేప్టీn పరికరాలను వెంటనే ఏర్పాటు- చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులదే!

Advertisement

తాజా వార్తలు

Advertisement