Monday, May 20, 2024

సభాపతుల నిర్ణయమే ఫైనల్.. విభజన బిల్లుపై ప్రధాని వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం: టీఆర్ఎస్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బిల్లులను ఆమోదించే క్రమంలో సభాపతులదే తుది నిర్ణయమని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ స్పష్టం చేసింది. తెలంగాణ ఏర్పాటు కోసం ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు’ను ఆమోదించే క్రమంలో అశాస్త్రీయంగా, హడావుడిగా వ్యవహరించారని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎంపీలు తప్పుబట్టారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదన తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడిన ప్రధాని, తెలంగాణ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని వ్యాఖ్యలు పార్లమెంట్‌ను, పార్లమెంట్ సాంప్రదాయాలను, స్పీకర్, డిప్యూటీ చైర్మన్‌లను సవాల్ చేసినట్టుగా ఉన్నాయని టీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు.

పార్లమెంటులో కార్యకలాపాలకు అడ్డు తగలడం, అవరోధాలు సృష్టించడం సహజమేనని, అలాంటి సందర్భాల్లో రూల్ బుక్‌ను అనుసరించి సభాపతులు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు. సభకు అడ్డుపడేవారిని సభ నుంచి బయటకు పంపిస్తుంటారని తెలిపారు. బిల్లులను పాస్ చేయడంలో ఆశాస్త్రీయమైన పద్ధతి అంటూ ఏదీ ఉండదని అన్నారు. మూజువాణి ఓటు లేదా, చేతులు ఎత్తిన సభ్యులను లెక్కించడం ద్వారా మెజారిటీ అభిప్రాయాన్ని గుర్తించి, తదనుగుణంగా బిల్లులు పాస్ చేస్తుంటారని వివరించారు. 2014 ఫిబ్రవరి 13న జరిగిన బిల్లుపై జరిగిన చర్చలో నేటి రాజ్యసభ చైర్మన్ నాడు సభ్యులుగా చురుగ్గా పాల్గొన్నారని గుర్తుచేశారు.

నిజానికి ఇప్పుడు బిల్లులు పాసవుతున్న తీరును ప్రధాని గుర్తించాలని, చాలా బిల్లులు హడావుడిగా ఎలాంటి ప్రస్తావన, నోటీసు లేకుండా రాజ్యాంగవిరుద్ధంగా పాసవుతున్నాయని ఆరోపించారు. కనీసం చర్చ అన్నదే లేకుండా బిల్లులను పాస్ చేస్తున్నది బీజేపీ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వమేనని రికార్డులు కూడా చెబుతున్నాయంటూ టీఆర్ఎస్ ఎంపీలు పేర్కొన్నారు. ఏదేమైనా సభాపతుల మాటే ఈ మొత్తం వ్యవహారంలో ఫైనల్ అంటూ తమ ప్రకటనలో స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వర రావు సహా పార్టీకి చెందిన మొత్తం 14 మంది ఎంపీల పేర్లతో ఈ ప్రకటన జారీ అయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement