Monday, April 29, 2024

గుజరాత్‌ దుర్ఘటనలో 30కి చేరిన మృతుల సంఖ్య.. రసాయన విషం వలనే మరణాలు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, బొటాడ్‌ జిల్లాల్లో ఆదివారం నకిలీ దేశీయ మద్యం సేవించి పలువురు అస్వస్థతకు గురైన సంగతి విదితమే. వారిలో కొంతమంది మరణించారు. ఆ మృతుల సంఖ్య మంగళవారం నాటికి 30కి చేరుకుందని అధికారులు తెలిపారు. ఇంకా 51మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, ‘రసాయన విషం’ వలనే ఈ మరణాలు సంభవించాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై విచారణ జరిపి మూడురోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించేందుకు ఐజీపీ సుభాష్‌ త్రివేదీ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని రాష్ట్ర హోం మంత్రి హర్ష్‌సంఘవి ప్రకటించారు. అదే సమయంలో అహ్మదాబాద్‌లోని దందూకాలో ప్రమాద మరణాలుగా నమోదైన మరో ఐదు కేసులు కూడా దర్యాప్తులో వున్నాయని ప్రభుత్వం పేర్కొంది.

అస్వస్థతకు గురైన 51మందిని భావ్‌నగర్‌, అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రులలో చేర్చారు. ఫుడ్‌ పాయిజనింగ్‌ వలన మరణించిన మొత్తం మరణాల్లో ఆరుగురు అహ్మదాబాద్‌లో, 22మంది బోటాడ్‌లో ఉన్నారు. మిగిలిన ఇద్దరి మరణాలకు కారణాలు తెలియాల్సి వుంది. ఇదిలా వుండగా గాంధీనగర్‌లోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) బాధితులు సేవించిన కల్తీమద్యాన్ని పరీక్షించగా దానిలో 98.71 శాతం, 98.99 శాతం మిథైల్‌ ఆల్కహాల్‌ వున్నట్టు తేలింది. ”ఇప్పటివరకు జరిగిన విచారణలో విషపూరిత రసాయన స్పైక్డ్‌ లిక్విడ్‌ తీసుకోవడంవల్ల మరణాలు సంభవించినట్లు తెలుస్తోంద”ని ప్రభుత్వం ప్రకటించింది. బాధితులు తాగిన విషపూరిత పానీయానికి తగిన విరుగుడు చికిత్స గురించి వైద్యుల బృందం ఎఫ్‌ఎస్‌ఎల్‌ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. మరో వైపు గుజరాత్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి సెక్షన్‌ 302 కింద కేసు నమోదచేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement