Saturday, April 27, 2024

గ్రామీణ రోడ్ల అనుసంధానం పెరగాలి.. భారీగా పెట్టుబడులు పెట్టాలన్న ఐఎంఎఫ్‌

గ్రామీణ రోడ్లపై ఇండియా తన డీజీపీలో తగినంత వాటాను ఖర్చు చేయాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) సూచించింది. దక్షిణాసియా అభివృద్ధి పథం పేరుతో ఐఎంఎఫ్‌ విడుదల చేసిన బుక్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించింది. 2030 నాటికి గ్రామీణ ప్రాంతాలతో అనుసంధానం చేయడం 90 శాతం పూర్తికావాలని పేర్కొంది. కొత్తగా 2.4 మిలియన్‌ కిలోమీటర్ల రోడ్లను వేయాల్సి ఉంటుంది. మొత్తం రోడ్ల పొడవులో కొత్త రోడ్లు 39 శాతం పెరగాలని తెలపింది. రోడ్ల నిర్మాణం విషయంలో ప్రాంతానికి, ప్రాంతానికి మధ్య ఖర్చు విషయంలో తేడాలు ఉంటాయని ఐఎంఎఫ్‌ తెలిపింది. దేశ ఉత్తర ప్రాంతాల్లో అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా నిర్మించే రోడ్లకు, దక్షిణాదిలో నిర్మించే రోడ్లకు అయ్యే ఖర్చులో చాలా తేడా ఉంటుందని తెలిపింది. దక్షణాది కంటే ఉత్తరాదిలో వేసే రోడ్లకు రెట్టింపు ఖర్చు పెరుగుతుందని పేర్కొంది. అన్ని ప్రాంతాలు కలుపుకుంటే దేశంలో రోడ్ల నిర్మాణానికి సరాసరిన కిలోమీటర్‌కు 5,09,000 డాలర్లు ఖర్చవుతుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది.

కొత్తగా గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ నిర్మించే 2.4 మిలియన్‌ కిలోమీటర్ల పొడవైన రోడ్ల నిర్మాణానికి 2030 నాటికి 1.2 లక్షల కోట్ల డాలర్లు నిధులు అవసరం అవుతాయి. 2030 నాటికి ఇండియా జీడీపీలో 2.7 శాతానికి సమానం. రోడ్లను అభివృద్ధి చేసేందుకు ఆర్ధిక వనరులు, భూమి విషయాల్లో చాలా సంస్కరణలు చేయాలని కోరింది. దీనికి అనుబంధంగా ఉండే సంస్థలను బలోపేతం చేయాలని ఐఎంఎఫ్‌ సూచించింది.భూ సేకరణలో తలెత్తే ఇబ్బందుల వల్లే చాలా మౌలికసదుపాయాల ప్రాజెక్ట్‌ల అమల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని తెలిపింది. ఈ విషయంలో ఉన్న బలహీనతలను అధిగమించాలని కోరింది. ప్రధానంగా పారదర్శకత పాటించాలని, ఏ అంశమైనా బహిరంగంగా వెల్లడించాలని సూచించింది. ప్రైవేట్‌ రంగం భూ సేకరణ, పరిహారం చెల్లింపు, ఇతర అంశాల్లో అనేక చిక్కులు ఎదుర్కొంటాయని, వీటిని ప్రభుత్వమే పరిష్కరించాలని కోరింది.

- Advertisement -

కేంద్ర రోడ్‌ ఏజెన్సీలు పూర్తి స్థాయిలో సిబ్బంది, కావాల్సిన పరికరాలతో పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉంటాయని, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాల వద్ద వీటి కొరత ఉంటుందని పేర్కొంది. రోడ్డు ఏజెన్సీలను సంస్థాగతంగా, సాంకేతికంగానూ బలోపేతం చేయాలని కోరింది. రోడ్‌ నెట్‌వర్క్‌ను సక్రమంగా పూర్తి చేసేందుకు ఇలాంటి చర్యలు తీసుకోవాలని తెలిపింది. ప్రైవేట్‌ రంగం కూడా రోడ్‌ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంలో కీలకంగా మారాయని ఐఎంఎఫ్‌ పేర్కొంది. ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యంలో రోడ్డు ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకు ప్రైవేట్‌ కంపెనీలు ముందుకు వస్తున్నాయని, ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాయని తెలిపింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, మార్కెట్ల నుంచి నిధులను సమీకరించేందుకు వీలుగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. అప్పుడే ఈ ప్రాజెక్ట్‌లు ఆర్ధికంగా లాభదాయకంగా మారుతాయని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement