Thursday, April 25, 2024

స్మాల్‌ ఈజ్‌ బిగ్‌.. చిన్న షేర్లుతో మంచి ఆదాయం, లాభాలు ఆర్జించిన 87 ఐపీఓలు

చిన్న కంపెనీలు క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి నిధుల సేకరణ 2022లో ఎక్కువగా జరిగింది. 2022లో ప్రధానంగా ఎంఎస్‌ఎంఈ కంపెనీల నుంచి వచ్చిన ఐపీఓలు ఇన్వెస్టర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. గత సంవత్సరం మొత్తం 109 ఎస్‌ఎంఈ సెక్టర్‌కు చెందిన కంపెనీలు పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చాయి. ఇందులో 87 శాతం కంపెనీల ఐపీఓలు ఇన్వెస్టర్లకు మంచి రాబడిని అందిచాయని ప్రైమ్‌డేటాబేస్‌ డాట్‌ కామ్‌ వెల్లడించింది. అత్యధికంగా 229 శాతం రిటర్న్స్‌ వచ్చాయి. 8 ఐపీఓలు వంద శాతం రాబడిని అందించాయి. మార్కెట్‌లో లిస్టింగ్‌ రోజే 25 కంపెనీలు ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. ఐపీఓలకు వచ్చిక కంపెనీల పనితీరు, దాని ఉత్పత్తులు, వాటి లాభదాయకత ఇలా చాలా అంశాలను ఇన్వెస్టర్లు పరిశీలించిన తరువాతే పెట్టుబడులు పెడుతుంటారు. సాధారణంగా పెద్ద కంపెనీల ఐపీఓలకు అధిక డిమాండ్‌ ఉంటుంది. ఎందుకంటే వాటికి ఉన్న బ్రాండ్‌ ఇమేజ్‌ వల్ల మంచి రాబడి వస్తుందని ఇన్వెస్టర్లు భావిస్తుంటారు. 2022లో మాత్రం దీనికి భిన్నంగా జరిగింది. చిన్న కంపెనీల పబ్లిక్‌ ఆఫర్‌లు బంపర్‌ ఆదాయాన్ని అందించాయి. చిన్న షేర్లే ఇన్వెస్టర్లను మెప్పించాయి.

2022లో 40 ప్రధాన కంపెనీలు పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చాయి. ఇవి మార్కెట్ల నుంచి 59,298 కోట్లు సేకరించాయి. 2021లో 63 పెద్ద కంపెనీలు మార్కెట్‌ నుంచి ఐపీఓ ద్వారా 1,18,723 కోట్లు సమీకరించాయి. ఎస్‌ఎంఈ రంగం నుంచి 2022లో 109 ఐపీఓలు వచ్చాయి. మార్కెట్ల నుంచి 1,874 కోట్లు సమీకరించాయ. 2021లో ఎస్‌ఎంఈ రంగం నుంచి వచ్చిన 59 ఐపీఓల ద్వారా 746 కోట్లు సమీకరించాయి. ఎస్‌ఎంఈ నుంచి వచ్చిన 31 ఐపీఓలు లిస్టింగ్‌ నాటికి నుంచి సంవత్సరం అంతా వంద శాతం లాభాలు తెచ్చి పెట్టాయి. కోల్‌కతాకు చెందిన కూల్‌ క్యాప్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు శుక్రవారం నాడు 52 వారాల గరిష్టానికి 415 రూపాయలకు చేరింది. ఐపీఓలో ఈ కంపెనీ ఆఫర్‌ ధర షేరుకు 38 రూపాయలు మాత్రమే. ఆఫర్‌ ధరపై ఈ షేరు ఇన్వెస్టర్లకు 888 శాతం లాభాన్ని తీసుకు వచ్చింది. వరుణీయం క్లౌడ్‌ షేరు 886 శాతం, రచన ఇన్‌ఫ్రా షేరు 637 శాతం, ఎంపైరియన్‌ క్యాషియో షేరు 584 శాతం రాబడిని అందించాయి.

నిరాశపరిచిన పెద్ద కంపెనీలు

- Advertisement -

2022లో చిన్న ఐపీఓలో ఇన్వెస్టర్లకు మంచి లాభాలు తెచ్చిపెడితే, పెద్ద కంపెనీల ఐపీఓలు దారుణంగా దెబ్బకొట్టాయి. డీసీఎక్స్‌ సిస్టమ్స్‌ ఐపీఓ ఆఫర్‌ ధర 207 రూపాయలు, ఈ కంపెనీ షేరు లిస్టింగ్‌ రోజు 49 శాతం లాభపడింది. పెద్ద కంపెనీల షేర్లు కొన్ని పర్వాలేదనిపించాయి. మరికొన్ని కంపెనీల షేర్లు మైనస్‌లో లిస్టయ్యాయి. ల్యాండ్‌మార్క్‌ కార్స్‌ ఆఫర్‌ ధర 506 రూపాయలు. ఈ కంపెనీ షేరు లిస్టింగ్‌ రోజు మైనస్‌ 9 శాతంగా ఉంది. రేయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ షేరు ఆఫర్‌ ధర 542రూపాయలకు లిస్టింగ్‌ రోజు మైనస్‌ 20 శాతంగా ఉంది. పెద్ద కంపెనీల్లో చాలా కంపెనీల షేర్లు ఆఫర్‌ ధర కంటే తక్కువగానే లిస్టయ్యాయి. ఎస్‌ఎంఈ రంగంలోని కొన్ని కంపెనీలు కూడా ఇన్వెస్టర్లు నష్టాలు తెచ్చిపెట్టాయి. పేస్‌ ఇ-కామర్స్‌ వెంచర్స్‌ సంస్థ షేరు ఆఫర్‌ ప్రైస్‌ 103 రూపాయలకు లిస్టింగ్‌ మాత్రం 30.5 రూపాయల వద్ద అయ్యింది. 2022లో వచ్చిన ఎస్‌ఎంఈ షేర్లలో 25కి పైగా ఆఫర్‌ ధర కంటే చాలా తక్కువగానే ట్రేడవుతున్నాయి.

పెరిగిన ఎస్‌ఎంఈ ఐపీఓలు

2022లో ఐపీఓకు వచ్చిన ఎస్‌ఎంఈ కంపెనీలు సంఖ్య ఎక్కువగా ఉంది. 2021తో పోల్చితే పెద్ద కంపెనీల ఐపీఓల సంఖ్య 63 నుంచి 40కి తగ్గాయి. అదే ఎస్‌ఎంఈ ఐపీఓల సంఖ్య 2021లో 59 వస్తే, 2022లో 109 వచ్చాయి. వీటిలో అగ్నీ గ్రీన్‌ పవర్‌ షేరు ఆఫర్‌ ధర 10 రూపాయలు ఉంటే, లిస్టింగ్‌ రోజు ఏకంగా 163 శాతం అధికంగా లిస్టయ్యింది. నిరాశపరిచిన వాటిలో ప్రధానంగా సిల్వర్‌ పెరల్‌ ఆస్పటాలిటీ లగ్జరీ స్పా షేరు 18 రూపాయల ఆఫర్‌ ధరకు లిస్టింగ్‌ మాత్రం మైనస్‌ 16 శాతం తక్కువగా లిస్టయ్యింది. ఇక భాటియా కలర్‌ ఛెమ్‌ షేరు ఆఫర్‌ ధర 80 రూపాయలు ఉంటే, లిస్టింగ్‌ రోజున 48 శాతం తక్కువకే లిస్టయ్యింది. ఇన్వెస్టర్లు ఆఫర్‌ ధరపై ఏకంగా 48 శాతం నష్టపోయారు. ఎస్‌ఎంఈ షేర్లలో పెట్టుబడులు తక్కువ రిస్క్‌ కలిగి ఉండటం కూడా మంచి పనితీరుకు ఒక కారణమని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రంగానికి ప్రభుత్వ పరంగా ఉండే రాయితీలు కూడా మరో కారణమని తెలిపారు. ఇన్వెస్టర్లుకు మాత్రం 2022లో చిన్న షేర్లే పెద్ద రాబడిని అందించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement