Friday, May 17, 2024

Elections | సార్వత్రిక ఎన్నికలకు ఈసీ రెడీ

న్యూఢిల్లి : పార్లమెంట్‌ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. రాష్ట్రాల వారీగా లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై సన్నద్దతను సమీక్షించడానికి ఈసీ కార్యాచరణ మొదలెట్టింది. జనవరి 7నుంచి రాష్ట్రాల వారీగా ఈసీ బృందం పర్యటించనుంది. తొలి విడతగా దక్షిణాది రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌, ఇతర కమిషనర్లు అనూప్‌ చంద్రపాండే, అరుణ్‌ గోయల్‌తో కూడిన ఈసీ బృందం ఈనెల 7న ఆంధ్రప్రదేశ్‌లో, 10న తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించనుంది.

ఈసీ పర్యటనకు ముందు డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల సన్నద్ధత గురించి ఈసీకి వివరించనున్నారు. డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఇప్పటికే అన్నిరాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల సన్నద్ధతను పరిశీలించారు. ఫిబ్రవరి ఆఖరిలో లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని వార్తల వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల పర్యటనకు శ్రీకారం చుట్టడం ప్రాధాన్యత ఏర్పడింది.

లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ముందు ఈసీ రాష్ట్రాల్లో పర్యటించడం సాధారణంగా ప్రతిసారీ జరిగే అధికారిక ప్రక్రియనే. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు, సీనియర్‌ పోలీసులు, పాలనా విభాగ అధికారులు, క్షేత్రస్థాయిలో ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందితో ఈసీ సమీక్షలు నిర్వహిస్తుంది. అయితే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈసీ బృందం పర్యటించనుందా లేదా? అనే దానిపై స్పష్టత లేదు.

ఇటీవలే ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాల్లో పర్యటన ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈసీ దేశవ్యాప్త పర్యటన పూర్తయిన అనంతరం.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశముంది. 2019లో లోక్‌సభ ఎన్నికలకు మార్చి 10న షెడ్యూల్‌ ప్రకటించిన ఈసీ ఏప్రిల్‌ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించింది. మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది. ఈసారి కూడా ఏప్రిల్‌- మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement