Thursday, May 2, 2024

India | టమాటా ధరలకు కళ్లెం.. నియంత్రణకు కేంద్రం చర్యలు

దేశంలో టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజురోజుకు గరిష్ట స్థాయిలకు చేరుతున్నాయి. కొద్ది వారాలుగా వంద రూపాయల మార్కుపైనే చక్కర్లు కొడుతున్న టమాటా ధరలు, కొన్నిచోట్లు కిలో రూ 200 పలుకుతున్నాయి. సామాన్యుడిని హడలెత్తిస్తున్నాయి. వంటగదిని ప్రభావితం చేస్తున్న ఈ ధరల పెరుగుదలకు కళ్లెం వేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ధరల నియంత్రణకు పలు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. ప్రధాన వినియోగ కేంద్రాల్లో టమాటా సరఫరాకు సత్వర చర్యలకు ఆదేశాలు జారీచేసింది.

టమాటా విస్తృతంగా పండించే ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, మహారాష్ట్ర నుంచి ఉత్పత్తులను సేకరించి, ధరలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పంపిణీ చేయాలని కేంద్ర సహకార సంస్థలైన జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(ఎన్‌ఎఎఫ్‌ఈడీ), జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్‌సిసిఎఫ్‌)లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఢిల్లిd-ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లోని ప్రజలకు జులై 14 నుంచి రాయితీ ధరలకు టమాటాలు పంపిణీ చేస్తామని కేంద్ర వినియోగదారుల వ్యవహారల శాఖ వెల్లడించింది.

శుక్రవారం నాటికి ఢిల్లి-ఎన్‌సిఆర్‌ ప్రాంతాల్లో వినియోగదారులకు అందుబాటు ధరల్లో టమాటాలు లభిస్తాయని ఆహార మంత్రిత్వశాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో అనేక చోట్ల టమాటా ధర రూ. 200కి చేరింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో, పంట దిగుబడి, సరకు రవాణాలో అంతరాయం ఏర్పడింది. దీనికారణంగా ఒక్కసారిగా టమాటా ధర రికార్డు స్థాయికి చేరింది.

- Advertisement -

దాదాపు ప్రతీ రాష్ట్రంలో టమాటా సాగు అవుతుండగా, దక్షిణ,పశ్చిమ ప్రాంతాలు మొత్తం ఉత్పత్తిలో 60 శాతం వాటాను కలిగివున్నాయి. వారి మిగులు ఉత్పత్తి దేశంలోని ఇతర ప్రాంతాలకు నిరంతరం సరఫరా అవుతుండేది. ఆయా ప్రాంతాల్లో పంటసాగు సీజన్‌లు వేర్వేరుగా ఉంటాయి. డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు గరిష్టస్థాయిలో పంట దిగుబడి ఉంటుంది. జులై-ఆగస్టు, అక్టోబర్‌ – నవంబర్‌ మాసాల్లో పరిస్థితులు టమాటా పంటకు అనుకూలం కాదు. ఈ కాలంలో ఉత్పత్తి సాధారణ స్థాయిల్లో ఉంటుంది.

సీజన్లకు అనుగుణంగా ధరలు మారుతుంటాయి. ముఖ్యంగా జులైలో ప్రతికూల వాతావరణం, వర్షాల కారణంగా ఉత్పత్తికి, సరఫరాకు అంతరాయాలు ఏర్పడుతుంటాయి. అలాంటప్పుడు ఒక్కసారిగా ధరలు పెరిగిపోయాయి. ఈసారి రుతుపవనాలు ఆలస్యంగా రావడం టామాటా పంట ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపినట్లు కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం గుజరాత్‌, మధ్యప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాలకు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్‌ నుంచి టమాటా సరఫరాలు వస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఢిల్లి, సమీప నగరాలకు హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక నుంచి సరఫరా జరుగుతున్నది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌తోపాటు మధ్యప్రదేశ్‌ నుంచి త్వరలో ఢిల్లిd పరిసర ప్రాంతాలకు టమాటా రవాణా ప్రారంభం అవుతుందని భావిస్తున్నట్లు పేర్కొంది. త్వరలోనే ధరలు నియంత్రణలోకి వస్తాయని కేంద్ర వినియోగదారుల శాఖ అంచనా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement