ముఖ్యమంత్రి తెలంగాణ భవన్‌లో కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్ష, పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ కార్పోరేషన్‌ల ఛైర్మన్‌లు హాజరయ్యారు. ఈ సమావేశంలో నాయకులకు పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం జరిగి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి తొమ్మిదేళ్లు పూర్తయ్యి, పదో ఏడు ప్రారంభం కానున్న నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2వ తేదీ నుంచి 21 రోజులపాటు ఈ దశాబ్ది ఉత్సవాలు కొనసాగుతాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలపై నేతలకు దిశానిర్దేశం చేసేందుకు సీఎం కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు.