Friday, March 29, 2024

పకడ్బందీగా టెన్త్‌ పరీక్షలు.. సీసీ కెమెరాల నిఘాలో నిర్వహణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు సంబంధించిన పరీక్ష హాల్‌టికెట్లను ఈనెల 24వ తేదీ నుంచి ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 94 వేల 616 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, ఇందుకోసం 2652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

- Advertisement -

త్వరలోనే పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై డీఈఓలు, ఎస్‌పీలు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రతీ రోజూ ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ ఏడాది 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకే వార్షిక పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 11తో ప్రధాన పరీక్షలు, 13న ఒకేషనల్‌ పరీక్షలు ముగియనున్నాయి. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement