Thursday, April 18, 2024

క్యూనెట్‌ వలలో చిక్కుకోవద్దు.. యువతకు ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్‌ సూచన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ అగ్ని ప్రమాద ఘటనలో దుర్మార్గపు సంస్థ క్యూనెట్‌ పాత్రపై సమగ్ర విచారణ జరిపించాలని టీఎస్‌ ఆర్టీసీ ఎండి విసి సజ్జన్నార్‌ అన్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ అగ్ని ప్రమాద ఘటనలో ఆరుగురు మృతి చెందిన ఘటనపై స్పందించిన సజ్జన్నార్‌ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఆరుగురు యువతీయువకులు మరణించడం తనను కలచివేసిందన్నారు. భారీ డబ్బును ఆశచూపి అమాయకులను మోసం చేస్తున్న క్యూనెట్‌ బాగోతం ఈ అగ్ని ప్రమాదం ఘటనతో మరోసారి బయటపడిందన్నారు.

ఆ కాంప్లెక్స్‌లో బీఎం5 సంస్థ పేరిట కాల్‌ సెంటర్‌ నిర్వహిస్తూ తెరవెనక క్యూ నెట్‌ ఎంఎల్‌ఎం దందా సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని చెప్పారు. దాదాపు 40 మందికి పైగా యువతీ యువకులు అక్కడ పనిచేస్తున్నట్లు తెలుస్తున్నదనీ, క్యూనెట్‌ ఏజెంట్లు ఒక్కొక్కరి దగ్గర రూ.1-50 నుంచి 3 లక్షల వరకు కట్టించుకున్నట్లు మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. మోసపూరిత క్యూనెట్‌పై అనేక కేసులు నమోదు చేసినా, ఈడీ ఆస్తులను జప్తు చేసినప్పటికీ ఆ సంస్ధ పనితీరు మారడం లేదన్నారు. మోసపూరిత సంస్థల విషయంలో భవన యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆ సంస్థ ఎలాంటిది అనేది నిర్ధారించుకుని అద్దెకివ్వాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement