Thursday, April 25, 2024

అమర జవాన్ల కోసం తెలుగు యువకుడి సైకిల్ యాత్ర

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పుల్వామా ఉగ్రదాడి ఘటనలో అసువులుబాసిన పారామిలటరీ బలగాల కోసం ఓ తెలుగు యువకుడు ఏకంగా 2 వేల కి.మీ సైకిల్ యాత్ర నిర్వహించాడు. జనవరి 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు నుంచి బయల్దేరి మంగళవారం నాటికి దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నాడు. ప్రకాశం జిల్లాకు చెందిన కీర్తి నాయుడు ఎస్సై పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడు. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడి ఘటన అతణ్ణి తీవ్రంగా కలచివేసింది. ఈ దుర్ఘటన జరిగి నాలుగేళ్లు కావొస్తున్న నేపథ్యంలో అమర జవాన్లకు ఘనంగా నివాళి అర్పించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఒంగోలు నుంచి ఢిల్లీ వరకు సైకిల్ యాత్రను మార్గంగా ఎంచుకున్నాడు. జనవరి 1 ఒంగోలు కలెక్టరేట్ వద్ద యాత్రను ప్రారంభించిన కీర్తి నాయుడు ప్రతి రోజూ సగటున 90 కి.మీ దూరం ప్రయాణించి మంగళవారం (జనవరి 24) నాటికి దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నాడు.

తీవ్రమైన చలిగాలుల మధ్య సైకిల్ యాత్రకు ఎక్కడా బ్రేకులు వేయకుండా ప్రతికూల పరిస్థితుల్లోనూ ముందుకే కదులుతూ తక్కువ సమయంలో యాత్రను పూర్తిచేశానని కీర్తి నాయుడు చెప్పారు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలని, తాను డిగ్రీ చదువుకుని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నానని తెలిపారు. దేశంలో యువత దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందని, అందుకే తాను ఈ యాత్రను చేపట్టి పూర్తిచేశానని వెల్లడించారు. నిజానికి ఫిబ్రవరి 14ను ప్రేమికుల దినోత్సవంగా కాకుండా అమర జవాన్ల త్యాగాలను గుర్తుచేసుకునే రోజుగానే భావించాలని కీర్తి నాయుడు కోరారు.

ఆంధ్ర అసోసియేషన్ సత్కారం

- Advertisement -

వీర జవాన్ల కోసం సాహసోపేతంగా సైకిల్ యాత్ర చేసిన కీర్తి నాయుడును ఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. దేశానికి వెన్నెముకలాంటి యువతకు కీర్తి నాయుడు స్ఫూర్తిగా నిలిచాడని ఆంధ్రా అసోసియేషన్‌ అధ్యక్షులు మణి నాయుడు, ప్రధాన కార్యదర్శి కోటగిరి సత్యనారాయణ, ఇతర నేతలు మెండు చక్రపాణి తదితరులు కొనియాడారు. ఢిల్లీలో బస సదుపాయంతో పాటు కీర్తి నాయుడు ఎస్సై కావాలన్న తన లక్ష్యాన్ని చేరుకోడానికి సహకరిస్తామని ప్రకటించారు. దేశం మనకేం ఇచ్చిందని ఆలోచించకుండా దేశం కోసం మనమేం చేస్తున్నామనే ఆలోచనతో కీర్తి నాయుడు మరికొంత మంది యువతకు ప్రేరణనిస్తూ సైకిల్ యాత్ర చేపట్టడం అభినందనీయమని వారంతా మెచ్చుకున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement