Thursday, November 7, 2024

నా మనోహరి… భాగ్యనగరి!

  • డైరెక్టర్‌ రాజమౌళి సినిమాలో నటించాలని ఉంది
  • ఇప్పట్లో నటించను… సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటా
  • మిస్‌ వరల్డ్‌ సాధించడమే నా లక్ష్యం

హైదరాబాద్‌, ఆహార్యంలో ఆమె సాధారణ తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తారు. అందంతోపాటు ఆత్మవిశ్వాసం, ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కోగల తెలుగు నేల సామర్థ్యం ఆమె సొంతం. సాధారణంగా అందాల పోటీలంటేనే చివరి క్షణం వరకు ఉత్కంఠకు పెట్టింది పేరు. ఎత్తు, అందం, ఆకర్షణ, ఆత్మవిశ్వాసం ఇలా పలు విభాగాల్లో నరాలు తెగేంత ఉత్కంఠతో కూడిన పోటీ ఉంటుంది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా గెలుపు ఏ క్షణంలోనైనా చేజారిపోవడం ఖాయం. అంతటి కష్టసాధ్యమైన అందాల పోటీలోనూ తెలుగమ్మాయి ప్రత్యేకించి హైదరాబాద్‌ బిడ్డ మానస వారణాసి ‘మిస్‌ ఇండియా’ కిరీటాన్ని గెలుచుకుంది. మిస్‌ ఇండియాగా గెలిచాక ఆమె తొలిసారి హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా ‘ఆంధ్రప్రభ’ పలుకరించగా పలు విషయాలను పంచుకున్నారు.

హైదరాబాద్‌ నగరంతో ఉన్న అనుబంధం ఎలాంటిది..?
హైదరాబాద్‌ నగరం అంటే ఎంతో ఇష్టం. నేను ఇక్కడే పుట్టాను. ఎంతో మంది స్నేహితులు, బంధువులు ఇక్కడే ఉన్నారు. హైదరాబాద్ ‌కు నా మనస్సుల్లో ప్రత్యేక స్థానం ఉంది. నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన నగరం ఇది.

ఈ గెలుపును ఎలా ఆస్వాదిస్తున్నారు..?
ఈ గెలుపును అమ్మమ్మకు అంకింత ఇస్తున్నాను. తాను మిస్‌ ఇండియాగా గెలవగానే మా అమ్మమ్మ నృత్యం చేయడం సంతోషాన్ని కలిగించింది. మిస్‌ ఇండియా హోదాలో అమ్మమ్మను హత్తుకోవడం, ముద్దుపెట్టుకున్నపుడు చాలా గర్వంగా భావించాను.


మిస్‌ వరల్డ్‌ పోటీలకు ఎలా సిద్ధమవుతున్నారు?
కొద్ది రోజులపాటు మిస్‌ ఇండియా గెలుపును కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితులతో ఆస్వాదిస్తాను. ఆ తర్వాత మళ్లిd ముంబై వెళ్లి మిస్‌ వరల్డ్‌ పోటీలకు శ్రమిస్తాను. భారత దేశానికి మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని సాధించడమే నా తదుపరి లక్ష్యం.

మీకిష్టమైన బాలీవుడ్‌ హీరో, హీరోయిన్‌ ఎవరు..?
నాకు ఎరుపురంగు అంటే ఇష్టం. ఎక్కువగా ఆ డ్రెస్‌లనే ధరిస్తాను. ఇష్టమైన బాలీవుడ్‌ హీరో అయుశ్మాన్‌ ఖురాన. ఇష్టమైన హీరోయిన్లు… ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణ.

- Advertisement -

సినిమాల్లో అవకాశం వస్తే హీరోయిన్‌గా నటిస్తారా..?
ప్రస్తుతానికైతే సినిమాల్లో నటించాలని అనుకోవడం లేదు. అలా అని సినిమాల్లో నటించనని చెప్పడం లేదు. అవకాశాలు వస్తే భవిష్యత్‌లో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా. సినీ డైరెక్టర్‌ రాజమౌళి సినిమాలో నటించాలని ఉంది.

అందాల పోటీల్లోకి రావాలని ఎందుకు అనిపించింది..? మీ వ్యక్తిత్వాన్ని వివరిస్తారా..?.
ఛాలెంజింగ్‌ టాస్క్‌ ఏదైనాఇష్టపూర్వకంగా చేయడం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. కొత్త కొత్త పనులు నేర్చుకోవడం, విషయాలు తెలుసుకోవడం, కొత్త ప్రాంతాల్లో పర్యటించడం, కొత్త వ్యక్తులతో మాట్లాడడం అన్నా చాలా ఇష్టం. ఈ క్రమంలోనే నా వ్యక్తిత్వాన్ని గమనించిన నా మిత్రులు మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొనమని ప్రోత్సహించారు.

మిస్‌ ఇండియాగా గెలవకపోతే ఏం చేసేవారు..?
మిస్‌ ఇండియాగా గెలవకపోతే యోగా టీచర్‌ అయ్యే దాన్ని. తాను ఉన్న ఆర్థిక విశ్లేషణ రంగంతోపాటు సామాజిక సమస్యలపై వివిధ ఎన్‌జీవోలు, సంస్థలతో కలిసి పనిచేసేదాన్ని.

Advertisement

తాజా వార్తలు

Advertisement