Saturday, April 20, 2024

పొత్తులు… ఎత్తులు!

ఎవరికెన్ని సీట్లు …ఎక్కడెక్కడ
చంద్రబాబు, పవన్‌ భేటీపై రాజకీయ కాక
భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ
తెలుగు తమ్ముళ్లలో కొత్త హుషారు
త్వరలోనే స్పష్టతకు అవకాశం

అమరావతి, ఆంధ్రప్రభ: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆకస్మిక భేటీ రాజకీయవర్గాల్లో కాక రేపు తోంది. ముఖ్యంగా అధికార పార్టీలో ఈ భేటీ ఆందోళనను రేకెత్తించింది. ఒకవైపు పరామర్శల పేరిట ఈ భేటీ జరిగినా, ఆ రెండు పార్టీల మధ్య పొత్తుల అంశంపైనే సుదీర్ఘమైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోం ది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇటీవల విశాఖలో భేటీ అయిన అనంతరం టీడీపీ, జనసేన పొత్తుపై కొంత సందిగ్ధత నెలకొంది. తాజాగా ఇరుపార్టీల అధినేతలు భేటీ కావడం వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్లుగా స్పష్టమౌతోంది. ఇప్పటి వరకూ జనసేనకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ రానున్న ఎన్నికల్లో తెదేపాతో పొత్తుకు పెద్దగా ఆసక్తి చూపకపోగా ఆ పార్టీకి చెందిన నేతలు అడపాదడపా చంద్రబాబుపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో జనసేన చీఫ్‌ చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకంది. తెలుగుదేశం, జనసేన పొత్తులపై ఆశలు సజీవంగానే ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సీట్ల పంపకంపై చర్చ?
ఈ ఆకస్మిక భేటీ తెలుగు తమ్ముళ్లలో మరింత హుషారును పెంచింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటను సాగిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్నారు. అధికారమే లక్ష్యంగా అడుగులువేస్తూ వ్యూహాలు రచిస్తూ వాటిని అమలుచేసే పనిలో నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగానే ఇప్పుడు తాజా భేటీ జరిగినట్లుగా స్పష్టమౌతోంది. ఒకవైపు చంద్రబాబు పర్యటనలకు ప్రజల నుండి మంచి స్పందన వస్తున్న తరుణంలో పవన్‌ భేటీ తెలుగుదేశంలో నూతనోత్సాహాన్ని పొంగిపొర్లేలా చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు పవన్‌ కల్యాణ్‌ పొత్తులపై ఇప్పుడే మాట్లాడటం సరికాదన్న అభిప్రాయన్ని వ్యక్తం చేసినా వారి మధ్య మాత్రం ఈ అంశం మీదే ప్రధాన చర్చ జరిగినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఈ భేటీలో దాదాపు పొత్తుల అంశం ఖరారైందన్నట్లుగా తెదేపా నేతలు చెబుతున్నారు. దీనిపై ఇరు పార్టీల అధినేతలు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. స్థానాల ఖరారు, పొత్తుల ప్రకటన అంశంపై త్వరలోనే మరోసారి పవన్‌, చంద్ర బాబులు భేటీ కానున్నట్లు సమాచారం. తాజా భేటీలో అధికార వైకాపా విధిస్తున్న ఆంక్షలపై ఉమ్మడి పోరు చేసేందుకు పవన్‌, చంద్రబాబులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన స్పష్టమైన ప్రకటనను కూడా చేశారు. ఈ పోరాటంతోనే పొత్తుల అంశంపై తొలి అడుగు పడుతుందన్న భావన రాజకీయవర్గాల నుండి వ్యక్తమవుతోంది. త్వరలో తెదేపా యువ నేత నారా లోకేష్‌ పాదయాత్ర చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 27 నుండి కుప్పం వేదికగా యువగళం పేరిట యాత్ర ను చేపట్టనున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్‌ కూడా త్వరలోనే బస్సుయాత్రను నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో ఈ యాత్రలపై కొంత సందిగ్ధత నెలకొన్న పరిస్తితి ఉంది. దీనిపై కూడా ఇరు నేతలు చర్చించారు. పరస్పర సహకారంతో ఆంక్షలను ఎదుర్కొనేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టమౌతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement