Friday, May 10, 2024

Delhi | వాన్‌పిక్ భూములపై సుప్రీం ‘స్టేటస్ కో’.. ప్రతివాదులకు నోటీసులు జారీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వాడరేవు-నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్‌పిక్) ప్రాజెక్ట్స్ భూముల అంశంలో యధాతథ స్థితి (స్టేటస్ కో) అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. శుక్రవారం జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కేసును విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదిగా ఉన్న వాన్ ప్రాజెక్ట్స్‌కు నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశించింది.

తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ మొత్తం వ్యవహారంలో స్టేటస్ కో అమలు చేయాలని ఆదేశించింది. కేసు విచారణ సందర్భంగా ప్రతివాదుల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే 15 సంవత్సరాల విలువైన సమయం వృధాగా గడచిపోయిందని అన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలతో ముడిపడ్డ అంశంగా న్యాయవాది తెలిపారు. ఎలా అని ధర్మాసనం ప్రశ్నించగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం – యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఒక దేశమైన ‘రస్ అల్ ఖైమా’తో కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేయిన స్పెషల్ పర్పస్ వెహికిలే ‘వాన్‌పిస్ ప్రాజెక్ట్స్’ అని వివరించారు.

కేసు విచారణలో జాప్యం కారణంగా ప్రాజెక్టు ముందుకు కదలడం లేదని, నేరంతో సంబంధం ఉన్న లావాదేవీలు ఏవైనా ఉంటే వాటిపై దర్యాప్తు జరపడంలో అభ్యంతరం లేదని, కానీ మొత్తం ప్రాజెక్టును నిలుపుదల చేసేలా భూములన్నింటినీ అటాచ్ చేయడం సరికాదని అన్నారు. తొలుత కేవలం నోటీసులు ఇవ్వాలని ఆదేశించిన ధర్మాసనం, ఈ వాదనల అనంతరం ‘స్టేటస్ కో’ ఇస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.

- Advertisement -

కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. వాడరేవు-నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్‌పిక్) ప్రాజెక్ట్స్ పేరుతో రస్ అల్ ఖైమా దేశంతో ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక నడవాను అభివృద్ధి చేయాలని భావించింది. అయితే జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసును దర్యాప్తు చేసిన ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ)’ వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ కోసం సేకరించి అప్పగించిన భూములను అటాచ్ చేసింది. 2014, 2017లో వాన్‌పిక్‌కు చెందిన మొత్తం 13,221 ఎకరాలను ఈడీ అటాచ్ చేసింది. ఈ అటాచ్‌మెంట్లను ఈడీ అడ్జుడికేటింగ్ అథారిటీ సమర్థించగా, అప్పీలేట్ అథారిటీ అటాచ్‌మెంట్ చట్ట విరుద్ధంగా జరిగిందని అభిప్రాయపడింది.

అయితే అటాచ్‌మెంట్ నుంచి భూములకు మాత్రం విముక్తి కల్పించలేదు. దాంతో వాన్‌పిక్ సంస్థ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు గత ఏడాది సెప్టెంబర్లో సందిగ్ధత లేని 1,416 ఎకరాల భూములను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం గత నెలలో ఈడీ అటాచ్‌మెంట్ చెల్లుబాటు కాదంటూ తీర్పునిచ్చింది. మిగిలిన 11,804.78 ఎకరాలను వెంటనే విడుదల చేయాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, సర్వోన్నత న్యాయస్థానం స్టేటస్ కో విధించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement