Friday, May 10, 2024

Delhi | ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసులు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మికి క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును సీబీఐ ఆశ్రయించింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్ లతో కూడిన ధర్మాసనం, ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎర్ర శ్రీలక్ష్మికి నోటీసులు జారీ చేసి విచారణ వాయిదా వేసింది. ఓబులాపురం మైనింగ్ కేసులో  శ్రీలక్ష్మిపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలను తెలంగాణా హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలనే సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

గనుల కేటాయింపులుల్లో ఓబులాపురం మైనింగ్ కంపెనీకి ఆయాచిత లబ్ది కలిగించారని శ్రీలక్ష్మీపై ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శ్రీ లక్ష్మి పనిచేస్తున్నారు. అనంతపురంలోని రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమ మైనింగ్ వ్యవహారాలపై  దర్యాప్తు జరిపిన సీబీఐ ఆమె కుట్రకు పాల్పడ్డారని, అక్రమంగా మైనింగ్ లైసెన్సులు మంజూరు చేశారని అభియోగాలు మోపుతూ కేసులు నమోదు చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగాలపై ఆమెను అరెస్టు కూడా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మి సుదీర్ఘకాలం పనిచేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement