Sunday, May 19, 2024

Delhi | ఇదిగో నెంబర్.. నేను చాట్ చేసింది కవితతోనే.. మరో స్క్రీన్ షాట్ విడుదల చేసిన సుకేష్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తాను చాట్ చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతోనే అంటూ మనీలాండరింగ్ కేసు నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ తాజాగా మరో లేఖ విడుదల చేశాడు. ఈ మేరకు కవిత ఉపయోగించిన నెంబర్లతో కూడిన ‘స్క్రీన్ షాట్‌’ను కూడా లేఖతో పాటు జతపరిచాడు. సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ద్వారా ఎమ్మెల్సీ కవితతో జరిపిన సంభాషణ అంటూ కొద్దిరోజుల క్రితం సుకేశ్ విడుదల చేసిన ‘స్క్రీన్ షాట్లు’ దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. అయితే అసలు సుకేశ్ ఎవరో తనకు తెలియదని, ఫేక్ స్క్రీన్ షాట్లతో తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కవిత వివరణ ఇచ్చారు. ఈ వివరణ గురించి తెలుసుకున్న సుకేశ్, తాను విడుదల చేసినవి ఫేక్ స్క్రీన్ షాట్లు కానేకాదని, తాను చాట్ చేసింది ఎమ్మెల్సీ కవితతోనే అని చెబుతూ రెండు నెంబర్లు కనిపించేలా (6209999999, 8985699999) తీసిన ‘స్క్రీన్ షాట్’ విడుదల చేశాడు.

ఇంతకాలం ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగా లేఖలు రాస్తూ.. వాటిలో ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించిన సుకేశ్.. ఈసారి కవితను కూడా లక్ష్యంగా చేసుకుని లేఖ రాశారు. కేజ్రీవాల్‌తో పాటు కవితకు కూడా ‘తిహార్ క్లబ్’ స్వాగతం పలుకుతోంది అంటూ ఎద్దేవా చేశారు. “కేజ్రీవాల్ తర్వాత నీ వంతే” అంటూ కవితను ఉద్దేశించి లేఖలో హెచ్చరించాడు. ఇప్పటి వరకు ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో జరిపిన చాటింగ్ వివరాలు అంటూ మీడియాకు విడుదల చేసిన సుకేశ్, త్వరలో కేజ్రీవాల్‌తో జరిపిన చాట్ వివరాలు విడుదల చేస్తానని ప్రకటించాడు.

- Advertisement -

తాను ఇదివరకు విడుదల చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్లపై ట్విట్టర్ ద్వారా సమాధానాలు ఇవ్వవద్దని, ఇవన్నీ పాత ట్రిక్కులని సుకేశ్ చంద్రశేఖర్ అన్నాడు. “నన్ను దొంగ, అర్ధిక నేరగాడు అంటూ విమర్శించారు, వాటిలో మీరు కూడా భాగస్వాములే” అంటూ కేజ్రీవాల్, కవితను ఉద్దేశించి వెల్లడించాడు. ధైర్యం ఉంటే సరైన రీతిలో, సక్రమంగా విచారణ జరిగేలా సహకరించాలని కవితకు సవాల్ విసిరాడు. తనకు కవిత అంటే ఎంతో మర్యాద, అభిమానం ఉన్నాయని, ఆమెను తన పెద్ద అక్కగా భావించానని సుకేశ్ తన లేఖలో పేర్కొన్నాడు. అందుకే ‘కవిత అక్క’ అని సంబోధించానని గుర్తుచేశాడు. అయితే ఇప్పుడు తాను దేశం కోసం, ప్రజాప్రయోజనాల కోసం నిజం మాట్లాడుతున్నానని చెప్పాడు. తన వద్ద మొత్తం 703 సంభాషణలు ఉన్నాయని, అందులో ఇప్పటి వరకు కేవలం 2 మాత్రమే (కవిత, సత్యేంద్ర జైన్) బయటపెట్టానని సుకేశ్ వివరించాడు. ఇంకా అనేక వీడియో చాట్లు, ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయని తెలిపాడు.

తెలుగు తనకెలా తెలుసని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారని, తన తండ్రి తెలుగువాడేనని, తల్లి మాతృభాష తమిళం అయినప్పటికీ ఇంట్లో తెలుగే మాట్లాడుకుంటామని చెప్పాడు. తనకు ఇంకా అనేక భాషలు వచ్చని వివరించాడు. తననెవరో రాజకీయంగా ప్రభావితం చేస్తున్నారన్న విమర్శలు అర్ధరహితమని వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ఈ లేఖలో సుకేశ్ ప్రకటించాడు. నిర్దోషిగా కేసుల నుంచి బయటపడాలని అనుకుంటున్నానని, తన గుండెల్లో ఉన్న భారాన్ని దించుకోవాలని భావిస్తున్నానని పేర్కొన్నాడు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement