Wednesday, April 17, 2024

ఐటీ రంగానికి అనుకూలం.. 84 గ్రామాల భూములకు మహర్దశ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని కీలకమైన హైదరాబాద్‌ శివారు ప్రాంతాల దశ మారనుంది. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల భూములు బంగారుమయం కానున్నాయి. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ పరిధిలోని 84 గ్రామాల్లో జీవో 111 ఆంక్షలను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ ప్రాంతం అభివృద్ధికి కీలకం కానున్నది. ఈ జీవో ఆంక్షల కారణంగా హైదరాబాద్‌ చుట్టూ పక్కల ఉన్న ఈ 84 గ్రామాలు ప్రస్తుతం 120 గ్రామాలుగా రూపాంతరం చెందాయి. అయితే ఈ ప్రాంతాలు జీవో 111 కారణంగా అభివృద్ధికి అమడ దూరంలో నిలిచిపోయాయి. తాజాగా ప్రభుత్వం జీవోను ఎత్తివేయడంతో పాటు ఆంక్షలను తొలిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ ప్రాంత భూములకు మహర్దశ పట్టనున్నది. ఆయా భూముల ధరలు రెండు, మూడు రెట్లు పెరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఆ ప్రాంతాల్లోని భూములే కాకుండా పరిసరాలు కూడా మెరుగైన మౌలిక సదుపాయాలు విస్తృతం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

గతంలో ఈ జీవో 111 పరిధిలోని భూములకు ఎకరాకు రూ.3 కోట్లు ఉండగా జీవో 111 పరిధికి అవతల ఉన్న భూముల ధరలు ఎకరాకు రూ.25 కోట్లకుపైగా ఉంది. అదే విధంగా ఈ ప్రాంతంలో భూములకు బ్యాంకులు మార్టిగేజ్‌ రుణాలు కూడా ఇవ్వడం లేదు. వ్యవసాయ రుణాలు తప్ప మిగతా రుణాలకు అవకాశం లేకుండాపోయింది. అయితే ఇప్పుడు పరిస్థితి తారుమారై ఈ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులు మరింత మెరుగుపడనున్నాయి.

ఈ రెండు జిల్లాల పరిధిలోని 120 గ్రామాల ప్రజలు, అభివృద్ధికి సుదూరంలో 1.32 లక్షల ఎకరాల భూములున్నాయి. హైదరాబాద్‌ జిల్లా విస్తీర్ణం 217 చదరపు కిలోమీటర్లు కాగా, జీవో 111 పరిధిలో 538 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. ఇప్పుడు ఈ భూములన్నీ ఇతర అవసరాలకు వినియోగంలోకి రానున్నది. తద్వారా ఈ ప్రాంతం అద్భుతంగా అభివృద్ధికి ఆనవాలుగా నిలువనుంది. ఐటీ, పారిశ్రామిక అవసరాలకు ఈ ప్రాంతం ఎంతో అనుకూలంగా ఉంది. హైదరాబాద్‌కు సమీపంలో, ఔటర్‌కు అత్యంత దగ్గర ఉండడంతో ఈ భూముల్లో అనేక పరిశ్రమలు, ఐటీ ఇండస్ట్రీస్‌ పెరగనున్నాయి.

జీవో 111 ఎత్తివేతతో ప్రభుత్వానికి భారీగా రాబడి సమకూరనుంది. ఈ జీవో అమల్లో ఉన్న ఏడు మండలాల్లో ప్రభుత్వ, అసైన్డ్‌ భూదాన్‌, సీలింగ్‌ భూములు కలిపుకుని 31,483 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ భూముల విలువ పెరగడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరనుంది. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.2 లక్షల కోట్లకుపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో 18,332 ఎకరాల ప్రభుత్వ భూమి, 9,235 ఎకరాల అసైన్డ్‌ భూమి, 2,660 ఎకరాల సీలింగ్‌ భూమి, 1256 ఎకరాల భూదాన్‌ భూములు ఉన్నాయి. అత్యధికంగా శంషాబాద్‌ మండలంలో 5,233 ఎకరాల ప్రభుత్వ భూములు ఉండగా మొయినాబాద్‌లో 1546 ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిని వివిధ అవసరాల కోసం ప్రభుత్వం వేలం వేసినట్లయితే సర్కారు ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతుంది. కొత్త కంపెనీలకు భూ కేటాయింపులతో పాటు అంతర్జాతీయ మల్టిd నేషనల్‌ ఐటీ కంపెనీలకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంది. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో 5వేలు ఎకరాలు అందుబాటులోకి రానున్నాయి.

ప్రస్తుతం 84 గ్రామాల్లో 30వేల ఎకరాలకు పైగా భూములకు ఆంక్షల ఎత్తివేతతో ఐటీ రంగం విస్తరించే అవకాశముంది. ఐటీ హబ్‌గా పేరున్న గచ్చిబౌలి ఈ ప్రాంతానికి చేరువగా ఉంది. జీవో ఎత్తివేతతో చేవెళ్ల, శంకర్‌పల్లి, కొత్తూరు వరకు ఐటీ పరిధి విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement