Wednesday, May 1, 2024

TS | గ్రేటర్‌లో బీఆర్​ఎస్​ బలోపేతం.. విస్తృతంగా పార్టీ సమావేశాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని భారాస కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్‌ మంగళవారం ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు హైదరాబాద్‌ నగర అభివృద్ధికి పాటు పడుతున్న తీరును ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని వారికి మార్గదర్శనం చేశారు. ఈ నెల 16న జీహెచ్‌ఎంసీ వార్డ్‌ కార్యాలయాలను ప్రారంభించనున్నట్లుగా తెలిపారు. వాటి ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ వారితో మమేకమయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు.

తెలంగాణ దశాబ్ధి ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో 16వ తేదిన వార్డు ఆఫీసులను ప్రారంభించడంతో నగరంలో సుపరిపాలన మరింత బలోపేతం అవుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ప్రజలకు మరింత చేరువ అవ్వాలన్న ఉద్ధేశ్యంతో పరిపాలన వికేంద్రీకరణ సంస్కరణలను చేపట్టారన్నారు.

- Advertisement -

వార్డు పాలన..

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి ఫలాలు ప్రజలకు దగ్గర చేసే బాధ్యత పార్టీ ప్రతినిధులపై ఉంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రెవెన్యూ డివిజన్లు, మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీలను నూతనంగా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల ఇంటి ముందు నిలిపేందుకు ప్రయత్నం చేశామన్నారు. ఇదే వికేంద్రీకరణ స్ఫూర్తితో వార్డ్‌ కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా నగర ప్రజలకు మరిన్ని సేవలు అందుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. నగరంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్లు వార్డు కార్యాలయ వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా వార్డు వ్యవస్థను తీసుకువస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ వ్యవస్థపై అవగాహన కోసం త్వరలో ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. 16న జరిగే వార్డు కార్యాలయాల ప్రారంభోత్సవాలకు తమ పరిధిలోని రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసొసియేషన్లు, వార్డులోని ప్రముఖ వ్యక్తులు, ఇతర సంఘాలను కలుపుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్పొరేటర్లకు సూచించారు. పార్టీ, ప్రభుత్వం ఇచ్చే అన్ని ప్రోగ్రామ్స్‌ను విజయవంతం చేస్తూ జనంలోకి వెళ్లాలని తెలిపారు.

ఎన్నికల ఏడాది..

వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో భారాస మరోసారి అధికారంలోకి రాబోతుందని పార్టీ కార్పొరేటర్ల సమావేశంలో మంత్రి కేటీఆర్‌ ధీమాను వ్యక్తం చేశారు. పార్టీ తరుపున నిర్వహించే ప్రతి సమావేశంలో పాల్గొనాలన్నారు. మరింతగా భారాసను బలోపేతం చేయాలని వారికి దిశానిర్ధేశం చేశారు. తమ తమ వార్డుల్లో పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేయాలని సూచించారు. రానున్న ఏడాది పాటు పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా ఉండాయని స్పష్టం చేశారు. కార్పొరేటర్లు గ్రేటర్‌ పరిధిలో పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement