Sunday, April 28, 2024

తెలంగాణ నుంచి రావలసిన పెండింగ్ బకాయిలు విడుదల చేయండి.. కేంద్రానికి రాష్ట్రమంత్రి కారుమూరి నాగేశ్వరరావు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించవలసిన పెండింగ్ బకాయిలను విడుదల చేయవలసినదిగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఆయన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, సంస్థ ఎండీ వీరపాండ్యన్ తదితరులతో కలిసి న్యూఢిల్లీలో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ భారత ఆహార సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ మీనాతో జరిగిన సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. అనంతరం వైఎస్సార్సీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, గోరంట్ల మాధవ్, చింతా అనురాధ, గొడ్డేటి మాధవితో కలిసి కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి 2012-13 ఆర్ధిక సంవత్సరం నుంచి 2017-18 వరకు రావలసిన రూ. 1702.90 కోట్ల బకాయిలను విడుదల చేయవలసినదిగా కోరారు.

ఆరేళ్లుగా పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే 2014-15 ఆర్ధిక సంవత్సరానికిగాను తెలంగాణ బకాయి పడిన రూ. 963.07 కోట్లను కూడా ఇప్పించవలసినదిగా కోరారు. వీటికి సంబంధించి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను పలుమార్లు కేంద్రానికి సమర్పించామని నాగేశ్వరరావు గుర్తు చేశారు.

వరి ధాన్యానికి వినియోగించే గోనె సంచులకు నగదును కేంద్రం చెల్లించాలని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ డిప్యూటీ సెక్రటరీని అయన కోరారు. హమాలీలకు చెల్లించాల్సిన మండీ లేబర్ ఛార్జీలు కూడా కేంద్రమే ఇవ్వాల్సి ఉందన్నారు. క్వింటాకు 22 రూపాయల వంతున కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం 2024-25 ఆర్ధిక సంవత్సరం వరకూ మండీ లేబర్ ఛార్జీలు చెల్లించాల్సి ఉందని వివరించారు. ధాన్య సేకరణ, ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అవసరమైన సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని మంత్రి కారుమూరి స్పష్టం చేశారు.

- Advertisement -

ప్రధానంగా రాష్ట్రం నుంచి బాయిల్డ్ రైస్‌ను సేకరించాలని, సబ్సిడీ బియ్యానికి సంబంధించి రాయితీ చెల్లింపు వివరాలను కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖకు సాధ్యమైనంత త్వరగా సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే బియ్యం సరఫరాకు అవసరమైన ర్యాకుల విషయంలో చాలీచాలనట్టు ఉండడంతో అవస్థలు పడుతున్నామని పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారు. ఎఫ్‌సీఐ నుంచి వివరాలు అందగానే రాష్ట్రానికి ఇవ్వాల్సిన సబ్సిడీ నగదు మొత్తాన్ని చెల్లిస్తామని పీయూష్ గోయల్ హామీ ఇచ్చారని మంత్రి కారుమూరి వివరించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement