Friday, May 31, 2024

Telangana formation Day | సారీ… హాజరు కాలేను : సోనియా గాంధీ

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తాను హాజరు కాలేకపోతున్నానని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలిపారు. జూన్ 2న తెలంగాణలో జరిగే ఆవిర్భావ వేడుకలకు రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు సోనియా గాంధీని ఆహ్వానించారు. ఈ వేడుకలకు ఆమె వస్తారని కాంగ్రెస్ నేతలు భావించారు. అయితే, ఈ వేడుకలకు తాను రావడం లేదని సోనియా గాంధీ తెలంగాణ నేతలకు తెలియజేశారు.

ఈ వేడుకలకు తన సందేశాన్ని పంపనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. దీంతో సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆ రోజు రేవంత్‌రెడ్డి తొలుత నాంపల్లిలోని గన్‌పార్క్‌ను సందర్శించనున్నారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.

ఏర్పాట్లలో భాగంగా ఆ రోజు పార్కింగ్ స్థ‌లం, ట్రాఫిక్ రూట్ మ్యాప్‌ను పోలీసులు సిద్ధం చేస్తున్నారు. వేడుకలకు వచ్చే వారికి ఎండ తగలకుండా షామియానాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక ఈ కార్య‌క్ర‌మం పండగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.

బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనూ..

బీఆర్ఎస్ పార్టీ కూడా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు కౌంటర్‌గా బీఆర్‌ఎస్‌ కార్యక్రమాలు రూపొందిస్తోంది. మూడు రోజుల పాటు నిర్వహించాలని యోచిస్తున్నారు. తెలంగాణ కోసం చేసిన‌ పోరాటం, తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement