Thursday, April 25, 2024

భారత్‌ vs ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో స్మిత్‌కు కప్టెన్సీ పగ్గాలు

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ ఆఖరి రెండు టెస్టులకు దూరమైన ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ వన్డే సిరీస్‌లో పాల్గొనడం దాదాపు అసాద్యమని తేలింది. దాంతో, అతని స్థానంలో స్టీవ్‌స్మిత్‌ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని ఆ జట్టు ప్రధాన కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ ఒక ప్రకటనలో వెల్లడించాడు. ‘వన్డే సిరీస్‌ కోసం ప్యాట్‌ కమిన్స్‌ భారత్‌ రావడం లేదు. అతను ఇంటి వద్దనే ఉండనున్నాడు. ప్రస్తుతం కష్ట సమయంలో ఉన్న కమిన్స్‌ కుటుంబానికి మేమంతా అండగా ఉన్నాం’ అని మెక్‌డొనాల్డ్‌ తెలిపాడు. తల్లి అనారోగ్యంతో ఉండడంతో కమిన్స్‌ రెండో టెస్టు అనంతరం స్వదేశానికి తిరిగి వెళ్లాడు.

అయితే.. ఆమె చనిపోవడంతో అతను అక్కడే ఉండిపోయాడు. కమిన్స్‌ గైర్హాజరీలో స్మిత్‌ మూడో టెస్టులో ఆసీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును గెలిపించాడు. భారత పర్యటన మొదలైనప్పటి నుంచి ఆసీస్‌ ఆటగాళ్లను గాయాలు వెంటాడుతున్నాయి. గాయంతో పేసర్‌ జోష్‌ హెజిల్‌వుడ్‌ టెస్టు సిరీస్‌ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఈమధ్యే గాయపడిన జై రిచర్డ్‌సన్‌ వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు. రిచర్డ్‌సన్‌ స్థానంలో నాథన్‌ ఎల్లిస్‌కు చోటు దక్కింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మిచెల్‌ మార్ష్‌ లు కూడా గాయంతో వన్డే సిరీస్‌ నుంచి తప్పుకున్నారు. ఇక మోచేతి గాయంతో చివరి రెండు టెస్టులు ఆడని ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వన్డేలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

- Advertisement -

వన్డే షెడ్యూల్‌ ఇదే

భారత్‌, ఆస్ట్రేలియా జట్లు మూడు వన్డేల సిరీస్‌లో తలపడనున్నాయి. మార్చి 17న ముంబైలో తొలి వన్డే ప్రారంభం కానుంది. మార్చి 19న విశాఖపట్నంలో రెండో వన్డే ఉంది. ఆఖరి వన్డే మార్చి 22న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఇరు దేశాల క్రికెట్‌ బోర్డులు వన్డే సిరీస్‌ జట్లను ప్రకటించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement